భారతీయ విద్యార్థులకు డాలర్‌ కష్టాలు

Indian Students Suffering Due To Increasing Dollar Rate - Sakshi

డాలర్‌ విలువ విపరీతంగా పెరగడంతో విలవిల్లాడుతోన్న వైనం!

చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో డాలర్‌ విలువ అనూహ్యంగా పెరిగిపోవడం, రూపాయివిలువ పతనంతో  అమెరికాలో భారతీయ విద్యార్థుల తిప్పలు అంతా ఇంతాకాదు. రూపాయి పతనంతో కొందరు మోడీ పాలనపై విరుచుకుపడుతోంటే, మరికొందరు కాంగ్రెస్‌నీ దూషిస్తూ తిలాపాపం తలాపిడెకడన్న సామెతను మరిపిస్తున్నారు. రాజకీయ కారణాలను పక్కనపెడితే రెక్కల ఆశలుతొడుక్కుని అమెరికాలోకి అడుగుపెడుతున్న వారిని రూపాయి విలువ పతనం ప్రభావం అతలాకుతలం చేస్తోంది. ఆరునెలల క్రితం డాలర్‌ విలువ 65 రూపాయల స్థాయినుంచి ఈ సెప్టెంబర్‌లో  72.54 రూపాయలకు క్షీణించడంతో అమెరికాలో ఉంటోన్న భారతీయ విద్యార్థుల అంచనాలకీ, ప్రస్తుత ఖర్చులకీ మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. 

రూపాయి విలువని బట్టే ప్రయాణాలూ, ఖర్చులూ....
 వారానికి మూడు రోజులు పార్ట్‌టైం జాబ్‌ చేసే వాళ్ళు సైతం నిద్రాహారాలు మాని ప్రతిరోజూ పార్ట్‌టైం ఉద్యోగం కోసం  పరుగులు పెడుతున్నారు. దీంతో అటు పిల్లలూ, వాళ్ళ ఖర్చులకి డబ్బులు పంపాల్సిన తల్లిదండ్రులూ తమతమ అవసరాలు కుదించుకోవడమో, లేదంటే ఖర్చుతో కూడుకున్న ప్రయాణాల్లాంటివి మానుకోవడమో చేస్తున్నారు. 

పిల్లల ఖర్చుల కోసం తల్లిదండ్రుల త్యాగాలు...
మనదేశంలో అప్పోసొప్పో చేసి ఉన్నతవిద్యాభ్యాసం కోసం అమెరికాకి వెళ్ళిన వారు తీసుకున్న రుణం సరిపోక యూనివర్సిటీలకు చెల్లించాల్సిన మొత్తం పెరిగిపోయి ఆ అగాధాన్ని పూడ్చుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు.  ముంబైకి చెందిన ప్రఫుల్ల వేదక్‌ డాలర్‌ విలువ 65 రూపాయలున్నప్పుడు తమ ఇద్దరు పిల్లలను అమెరికాలో చదివించేందుకు బ్యాంకు లోన్లూ, ఇతర ఖర్చులని బట్టి ప్లాన్‌ చేసుకున్నారు. కానీ రూపాయి పతనం ప్రారంభం కావడంతో కొద్దికాలం ఎదురుచూసారు. అయినా రూపాయి విలువ పెరక్కపోగా మరింత దిగజారింది. యూనివర్సిటీకి కట్టాల్సిన ఫీజు ఆలస్యం అయ్యి ఫైన్‌తో సహా కట్టాల్సి రావడమే కాకుండా అనుకున్నదానికంటే ఎక్కువ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పెద్దకొడుకు కాన్వకేషన్‌కి  వెళ్ళాలనుకున్న తల్లిదండ్రులు ప్రయాణాన్ని మానుకోవాల్సి వచ్చింది. 

రుణభారం పెరిగిపోతోంది....
డెట్రాయిట్‌లోని వెయిన్‌ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీకోసం నిమిష్‌ బందేకర్‌ అనే 23 ఏళ్ళ విద్యార్థి రూపాయికి డాలర్‌ మారకం విలువ 66 రూపాయలున్నప్పుడు  30 లక్షలు బ్యాంకు రుణం తీసుకొని అమెరికా వెళ్ళాడు. రూపాయి విలువ అనూహ్యంగా క్షీణించడంతో ఫీజుకోసం తీసుకున్న రుణం  కట్టాల్సిన లోను సరిపోలేదు. దీంతో నాలుగోయేడాది విద్యకొనసాగించడం అసాధ్యంగా మారింది. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top