మలేషియాలో క్షమాభిక్ష  

Amnesty In  Malesia - Sakshi

ఈ నెలాఖరుతో ముగియనున్న ఆమ్నెస్టీ

అక్రమంగా ఉంటున్న  కార్మికులకు ఊరట

తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికుల సంఖ్య రెండువేలకు పైగానే

మోర్తాడ్‌(బాల్కొండ) : పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధిగాంచిన మలేషియాలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులు సొంత గడ్డకు వెళ్లిపోవడానికి అక్కడి ప్రభుత్వం ఆమ్నెస్టీ(క్షమాభిక్ష)ను అమలు చేస్తోంది. పది నెలల క్రితం ఆమ్నెస్టీని అమలులోకి తీసుకురాగా ఈనెలాఖరుతో ముగిసిపోనుంది. మలేషియా ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ గత మే 31తోనే ముగిసింది. అయితే మలేషియా ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడగించడంతో ఈనెలాఖరు వరకు క్షమాభిక్ష కొనసాగనుంది.

పర్యాటకుల పాలిట స్వర్గధామమైన మలేషియాలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు ఏజెంట్లు తెలంగాణ జిల్లాలకు చెందిన నిరుద్యోగులను తరలిస్తున్నారు. మలేషియాలో వర్క్‌ వీసాలకు బదులు విజిట్‌ వీసాలనే ఏజెంట్లు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. మలేషియాలో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తుండటంతో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారు భయంతో దాక్కునాల్సి వస్తోంది. విజిట్‌ వీసాలపై మలేషియాలో అడుగు పెట్టిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, సూపర్‌మార్కెట్‌లు, ఇతర వాణిజ్య సంస్థలలో పని కల్పించడం లేదు.

దీంతో వారు పామోలిన్‌ తోటలలోనే రహస్యంగా పని చేయాల్సి వస్తోంది. పామోలిన్‌ తోటలలో పని చేసే వారికి పాములు, తేళ్ల బెడద తీవ్రంగా ఉంటుంది. మలేషియాలో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణ కార్మికుల సంఖ్య దాదాపు రెండువేల వరకు ఉంటుందని భారత హైకమిషన్‌ అధికారులు అంచనా వేసి వెల్లడించారు. క్షమాభిక్షను వినియోగించుకుని సొంత గడ్డకు వచ్చేవారు రూ.8 వేల జరిమానా చెల్లించి, సొంతంగా టిక్కెట్‌ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

క్షమాభిక్ష అమలు లేని సమయంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారు ఇంటికి రావాలంటే భారీ మొత్తంలో జరిమానా చెల్లించడమే కాకుండా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల క్షమాభిక్ష సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛంద సంఘాల నాయకులు కోరుతున్నారు. 

టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం..

మలేషియాలో ఆమ్నెస్టీ అమలు నేపథ్యంలో టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మలేషియాలో పర్యటిస్తుంది. టీపీసీసీ గల్ఫ్‌ కో ఆర్డినేటర్‌ నంగి దేవెందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సభ్యులు మూడు రోజుల నుంచి మలేషి యాలో తెలంగాణ కార్మికులు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంగి దేవెందర్‌రెడ్డి ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. మలేషియాలో క్షమాభిక్ష అమలు విషయంపై ఎవరికీ అవగాహన లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్త శుద్ది లేదని ఆరోపించారు. మలేషియాలో ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన కార్మికులే ఎక్కువ మంది ఉన్నారని వీరంతా విజిట్‌ వీసాలపై వచ్చి కష్టాలు పడుతున్నవారే అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కార్మి కులను సొంతూర్లకు రప్పించే చర్యలను చేపట్టా లని డిమాండ్‌ చేశారు. 

చేతిలో డబ్బు లేక జరిమానా చెల్లించి, టిక్కెట్‌ కొనుక్కొనే పరిస్థితి కార్మికులకు లేదని తెలిపారు. ప్రభుత్వమే టిక్కెట్‌లను ఇప్పించి జరిమానాకు సంబంధించిన సొమ్మును జమ చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్షమాభిక్షకు ఎక్కువ సమయం లేదని అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించి తెలంగాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top