32ఏళ్ల పోరాటానికి ఫలితమేదీ?

32ఏళ్ల పోరాటానికి ఫలితమేదీ? - Sakshi


న్యూఢిల్లీ:

దేశంలో అత్యంత పెద్దదైన నర్మదా సరోవర్‌ జలాశయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేసిన సందర్భంగా, ఈ ప్రాజెక్ట్‌ను కార్యరూపం దాల్చకుండా నిలువరించేందుకు 32 సంవత్సరాలపాటు సుదీర్ఘంగా సాగిన పోరాటం గురించి ఒక్కసారి కూడా గుర్తుచేసుకోకపోవడం శోచనీయం. సామాజిక కార్యకర్త మేథాపాట్కర్‌ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కోసం దాదాపు తన జీవితాన్నే అంకితం చేశారు. బాబా ఆమ్టే లాంటి మహానుభావులు, అరుంధతీరాయ్‌ లాంటి రచయితలు, మేథావులు ఈ ఆందోళనలో భాగస్వాములయ్యారు. ఆమీర్‌ ఖాన్‌ లాంటి సినిమా నటులు ఆందోళనకు అండగా నిలిచారు.



‘వికాష్‌ చాయియే...వినాశ్‌ నహీ’ నినాదంతో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ఈ ఆందోళనకు మరో ప్రత్యేకత ఉంది. హింసకాండకు ఆస్కారం లేకుండా శాంతియుతంగా కొనసాగడం. జల సత్యాగ్రహం అనే పదం కూడా ఈ ఆందోళన నుంచే పుట్టింది. కోర్టులు, ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు, సత్యాగ్రహాలు....ఇలా పలు రూపాల్లో కొనసాగిన నర్మదా బచావో ఆందోళనల్లో బాధిత ఆదివాసీలు, అటవి తెగలు, పలు ఎన్జీవో సంస్థలు, మేథావులు, రంగస్థల, సినీ కళాకారులు, రాజకీయ నాయకులు పాల్లొన్నారు. ప్రస్తుతం బీజీపీతో దోస్తీ కుదుర్చుకున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కూడా గత ఏడాది, సెప్టెంబర్‌ నెలలో బాధితుల తరఫున ఆందోళన చేశారు.

 

‘డ్యామ్‌లు ఆధునిక భారత దేశానికి దేవాలయాలు’గా అభివర్ణించే భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ 1961లో ఈ నర్మదా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పుడు చిన్న డ్యామ్‌ కోసం ప్రణాళిక రచించారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన చిమన్‌భాయ్‌ పటేల్‌ ఈ ప్రాజెక్ట్‌ను అనూహ్యంగా విస్తరించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పనులను వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో గుజరాత్‌ నందనవనంగా మారుతుందని ఆయన కలుగన్నారు. ఆ కల తీరకుండానే ఆయన మరణించడంతో ఆయన ముందస్తుగా చేసిన సూచనల మేరకు ఆయన అస్థికలను కూడా డ్యామ్‌లోనే కలిపారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక డ్యామ్‌ నిర్మాణం పనులు మళ్లీ ఊపందుకున్నాయి.





ఈ ప్రాజెక్ట్‌ను విస్తరించడాన్ని పొరుగునున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మందుగా వ్యతిరేకించింది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయి. ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం ఓ ట్రిబ్యునల్‌కు కూడా వేశారు. 1984లో మేథాపాట్కర్‌ లాంటి సామాజిక కార్యకర్తలు ప్రాజెక్ట్‌ స్థలాన్ని సందర్శించి ఆదివాసీల స్థానభ్రంశం గురించి తెలుసుకున్నారు. వారి తరఫున వెంటనే ఆందోళన చేపట్టారు. 1989లో ‘నర్మదా బచావో ఆందోళన్‌ (ఎన్‌బీఏ)’ పేరుతో ఆందోళనను తీవ్రతరం చేశారు. ఆ తర్వాత బాధితుల తరఫున మధ్యప్రదేశ్‌లో ‘నర్మదా ఘటీ నవ నిర్మాణ సమితి’, మహారాష్ట్రలో ‘నర్మదా ధరంగ్‌రాష్ట్ర సమితి’ పేరిట ఆందోళనలు కొనసాగాయి. ప్రజా పోరాటాలు, సుప్రీం కోర్టు జోక్యం కారణంగా మధ్యప్రదేశ్‌లో నిరాశ్రీయులైన దాదాపు 50 వేల మందికి, గుజరాత్‌లో నిరాశ్రీయులైన దాదాపు రెండు లక్షల మంది ఆదివాసీలకు పునరావాసం కల్పించారు. కొత్త చోట అరకొర సౌకర్యాలు మాత్రమే ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం అందకపోవడంతో ఇప్పటికీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న గ్రామాల్లో సగం జనాభా ఖాళీ చేయలేదు.



అయినప్పటికీ నర్మదా నది డ్యామ్‌ గేట్లను మూసివేసేందుకు గత జూన్‌ నెలలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూర్తి నష్టపరిహారం చెల్లించి, ముంపు గ్రామాల ప్రజలను పూర్తిగా తరలించేవరకు డ్యామ్‌ గేట్లను మూయరాదంటూ ప్రపంచవ్యాప్తంగా 26 మంది నోబెల్‌ బహుమతి గ్రహీతలు, దాదాపు రెండువందల ఎన్జీవో సంస్థలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశాయి. భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇవ్వలేని సందర్భాల్లో 60 లక్షల రూపాయల నగదు చొప్పున నష్టపరిహారంగా ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు చెబుతోంది. అయితే నాలుగోవంత నష్టపరిహారం కూడా అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకండా ముంపు గ్రామాలను ఖాళీచేయమని, ఆ గ్రామాల్లోనే ఉంటామని 53 శాతం ప్రజలు తెలియజేస్తుండగా, 31 శాతం మంది ప్రజలు ఖాళీచేసి పునరావాస గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమని తెలియజేస్తున్నారు. అలాగే పునరావాస కేంద్రాల నుంచి తిరిగి సొంత గ్రామాలకు వెళ్లేందుకు 50 శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేస్తుండగా, 30 శాతం మంది అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.



అంటే, మెజారిటీ గ్రామాల ప్రజలు సొంత గ్రామాల్లో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. పునరావాస గ్రామల్లో 55 శాతం మందికి రక్షిత మంచినీరు అందకపోవడం, 63 శాతం మందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, 86 శాతం మందికి ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడం వారి వైఖరికి కారణంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆదివారం రోజున కూడా మధ్యప్రదేశ్‌లోని బరోలా గ్రామంలో మేథాపాట్కర్‌ సత్యాగ్రహం చేశారు. ఆధునీకరణ, అభివృద్ధి, సామాజిక, ఆర్థికాభివద్ధికి భారీ ప్రాజెక్టులు అవసరమని పాలకులు వాదిస్తారుగానీ, బాధితుల జీవితాలను పణంగాపెట్టే ఈ మార్పులను సమాజం అంగీకరించలేదు. ఆడవుల్లో ఉండే మానవులను అభివద్ధి పేరిట రోడ్లపైకి ఈడ్చుకురావడంకన్నా వారుండే అడవుల్లోకే అభివద్ధి రోడ్లను తేసుకెళ్లడం ఎంత ఉత్తమమో ఆలోచించాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top