కంటైన్‌మెంట్‌ జోన్లలో సీసీ కెమెరాలు!

WB Government Decides To Install CCTV Cameras In Containment Zones - Sakshi

కోల్‌కత: కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కోల్‌కతాలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పక్కాగా తెలుసుకోవచ్చని కోల్‌కత నగరపాలక సంస్థ అధికారులు సోమవారం తెలిపారు. కంటైన్‌మెంట్‌ జోన్లలోని ప్రజల కదలికలను లాల్‌బజార్లో ఉన్న కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. కోల్‌కతాలోని 480 కంటైన్‌మెంట్‌ జోన్లలో 500 సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు.

అధిక జనాభా ఉన్న కోల్‌కతా నగరంలో కోవిడ్‌ ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇక లాక్‌డౌన్‌ సడలింపులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కోవిడ్‌ ఆస్పత్రులు ఉన్న ప్రాంతాలను సైతం ప్రభుత్వం కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించింది. దీంతో కోల్‌కతాలో కంటైన్‌మెంట్‌ జోన్ల సంఖ్య అమాంతం పెరిగింది. పశ్చిమ బెంగాల్‌లో కంటైన్‌మెంట్‌ జోన్లను ‘ప్రభావిత ప్రాంతాలు’గా పిలుస్తున్నారు. వాటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్‌ జోన్లుగా పేర్కొంటున్నారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు కనుగొనేందుకు ప్రభావిత ప్రాంతాల్లోనే కొందరిని నియమించుకుంటామని అధికారులు తెలిపారు.
(చదవండి: 8 రోజుల్లోనే క‌రోనాను జ‌యించిన 93 ఏళ్ల వ్య‌క్తి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top