అంబులెన్సుకు దారివ్వకుంటే రూ.10 వేల ఫైన్‌

Union Cabinet clears fresh DNA profiling bill - Sakshi

హెల్మెట్‌ లేకుంటే రూ.వెయ్యి జరిమానా, 3 నెలలు లైసెన్స్‌ రద్దు

మైనర్లు యాక్సిడెంట్‌ చేస్తే తల్లిదండ్రులే దోషులు

వారికి మూడేళ్ల జైలుశిక్ష

కేంద్ర కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సోమవారం నాడిక్కడ సమావేశమైంది. ఈ భేటీలో మోటార్‌ వాహనాల(సవరణ) బిల్లు–2019తో పాటు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ బిల్లు–2019కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వాహనాలు నడిపేటప్పడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిప్రకారం అంబులెన్స్, ఇతర అత్యవసర సేవల వాహనాలను దారి ఇవ్వకుంటే రూ.10,000 వరకూ జరిమానా విధిస్తారు. డ్రైవింగ్‌ చేసేందుకు అనర్హులైనప్పటికీ వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరినామా విధించేలా బిల్లును రూపొందించారు.

సీటు బెల్ట్‌ లేకుంటే లైసెన్స్‌ రద్దు..
రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ.1,000 నుంచి రూ.2,000 జరిమానా విధించాలని బిల్లులో నిబంధనలు చేర్చారు. ఇక ఇన్సూరెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 కట్టాలి. వాహనాల్లో సీటు బెల్టు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించడంతో పాటు 3 నెలలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుచేస్తారు. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తే రూ.1,000 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దవుతుంది. ఒకవేళ మైనర్‌ పిల్లలు రోడ్డు ప్రమాదానికి కారకులైతే వారి తల్లిదండ్రులు/ సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. సదరు తల్లిదండ్రులు/ సంరక్షకులకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించవచ్చు. ఇలాగే ప్రమాదానికి కారణమైన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేస్తారు.

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులకు విధిస్తున్న రూ.100 జరిమానాను ఈ బిల్లులో రూ.500కు పెంచుతూ బిల్లును రూపొందించారు. అధికారుల ఆదేశాలు పాటించకుంటే విధించే పెనాల్టీని రూ.500 నుంచి రూ.2 వేలకు పెంచారు. ఒకవేళ లైసెన్స్‌ అందుకోకుండానే వాహనాలు నడిపితే, లైసెన్స్‌ లేకుండా నడిపేవారికి రూ.5,000 జరిమానా విధించనున్నారు. అలాగే ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసేవారికి రూ.5,000, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఓవర్‌ లోడింగ్‌ వాహనాలు రూ.20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. ఒకవేళ ఈ నిబంధనలను స్వయంగా సంబంధిత అధికారులు ఉల్లంఘిస్తే జరిమానా రెట్టింపు అవుతుంది.  

డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ బిల్లుకు ఆమోదం..
నేరాల్లో వ్యక్తులను గుర్తించేందుకు ఉద్దేశించిన డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ బిల్లు–2019కు కేబినెట్‌ ఓకే చెప్పింది. బిల్లు ప్రకారం ప్రభుత్వం జాతీయ డీఎన్‌ఏ బ్యాంకు, ప్రాంతీయ డీఎన్‌ఏ బ్యాంకులను ఏర్పాటుచేస్తుంది. ఈ బ్యాంకుల్లో నేరం జరిగిన ప్రాంతంలోని డేటా, నిందితుల డేటా, అదృశ్యమైన వ్యక్తుల డేటా, గుర్తుతెలియని మృతుల డేటాను విడివిడిగా నిర్వహించాలి. అలాగే ఈ బిల్లు ప్రకారం డీఎన్‌ఏ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తారు. డీఎన్‌ఏను విశ్లేషించే ప్రతీ ల్యాబ్‌ ఈ సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది.  ఏడేళ్లు అంతకంటే ఎక్కువశిక్ష పడే నేరాలు లేదా హత్య కేసుల్లో డీఎన్‌ఏ సేకరణకు నిందితుల అంగీకారం అక్కర్లేదు. ఈ రెండు బిల్లులను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top