వీరంతా రాహుల్‌ కోసం నిరీక్షణ!

These People Are Waiting For Rahul Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మారా (45), గీతా (45), రమా (47), కమలా (60), దేవీ (41), రాధా (35), లీలా (46). వీరందరు రాహుల్‌ గాంధీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకో అనుకుంటూ ఏవో అర్థాలు ఊహించుకుంటే పొరపాటే. వీరంతా వరినిలం, థాచర్‌కొల్లి ఆదివాసీ కాలనీ వాసులు. రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఈ కాలనీలు ఉన్నాయి. మొత్తం కేరళ జనాభాలో 18. 5 శాతం ఆదివాసీలు ఉండగా, వారిలో ఎక్కువ మంది ఈ కాలనీల్లోనే ఉంటున్నారు. వారు ఉంటున్న ఒక్కో క్లస్టర్‌లో 150 నుంచి 200 మంది ఆదివాసీ ఓటర్లు ఉన్నారు. వీరెవరికి రాహుల్‌ గాంధీగానీ, రాజీవ్‌ గాంధీగానీ తెలియదు. వీరిలో ఇంటి వెనకాట మేకలు, కోళ్లు పెంచుకుంటూ బతుకుతున్న కమలా అనే 60 ఏళ్ల మహిళకు మాత్రం రాధాకృష్ణ అనే స్థానిక పంచాయతీ సభ్యుడొకరు తెలుసు. మిగతా వారికి ఆ సభ్యుడి పేరు కూడా తెలియదు. 

వీరిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే కాకుండా స్థానిక ఎన్నికల్లో తప్ప అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేసిన అనుభవం కూడా లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు స్థానికులు వచ్చి, జీవుల్లో తీసుకెళతారని, టీ, టిఫిన్‌ పెట్టించి ఓట్లు వేయించుకుంటారని వారు చెప్పారు. తమ మగాళ్లకు డబ్బులు కూడా ఇస్తారని తాము విన్నామని, అయితే తమకు మాత్రం ఎన్నడూ ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదని వారు చెబుతున్నారు. మీడియా వారి వద్దకు వెళ్లి రాహుల్‌ గాంధీ గురించి అడిగినప్పుడు వారు తెల్లమొఖం వేశారు. ఒక్క రాహుల్‌ గాంధీయే కాదు, ఆయనపై ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీపీ సునీర్, బీజేపీ మిత్రపక్షమైన భారత్‌ ధర్మ జన సేన అభ్యర్థి తుషార్‌ వెల్లప్పలి కూడా తెలియదు. 

వయనాడ్‌ లోక్‌సభ సీటు పరిధిలో మూడు వయనాడ్, మలప్పురం, కోజికోడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసి ఉన్నాయి. వయనాడ్‌లోనే ఆదివాసీలు అత్యధికంగా ఉంటున్నారు. 2009లో వయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంఐ షణవాస్‌ పోటీ చేసి ఏకంటా 1,53,439 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. 2014లో ఆయన మళ్లీ పోటీ చేసినప్పుడు ఆయన మెజారిటీ 20,870 ఓట్లకు మాత్రమే పరిమితం అయింది. 2018, నవంబర్‌లో ఆయన మరణించడంతో ఆ సీటు ఖాళీ అయింది. అప్పటి నుంచి ఈ సీటులో కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యమే కొనసాగుతున్నప్పటికీ  2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతంలో ఏడు అసెంబ్లీ సీట్లకుగాను నాలుగు సీట్లను గెలుచుకొంది. ఇక బీజేపీ అంతంత మాత్రంగానే ఉంది. 

ఏప్రిల్‌ నాలుగవ తేదీన రాహుల్‌ గాంధీ నామినేషన్‌ వేయడానికి వేయనాడ్‌ వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం చెబుతూ నియోజకవర్గం పలు ప్రాంతాల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అయితే ఆదివాసీల్లో నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల వారి ప్రాంతాల్లో కటౌట్లు ఏర్పాటు చేయడం లేదు. ఈ ప్రాంతంలో అనిల్‌ కుమార్‌ అనే కాంగ్రెస్‌ శాసన సభ్యుడు ఎన్నికల ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. ఈసారి రాహుల్‌ గాంధీ ఆదివాసీల ప్రాంతంలో కూడా పర్యటిస్తున్నారని ఆయన చెబుతున్నారు. అందుకునే ఈ మహిళలంతా రాహుల్‌ గాంధీ కోసం ఎదురు చూస్తున్నారు. తమ సమస్యలను ఆయనకు చెప్పుకుంటే తీరుతాయని వారు భావిస్తున్నారు. 

తాము మంచి నీళ్ల కోసం కనీసం రెండు కిలోమీటర్ల దూరంలోని కొండప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని, ఆదివాసీల కోసం కుటుంబానికి ఐదు ఎకరాల చొప్పున వ్యవసాయ భూములు ఇస్తామని చెప్పి పదేళ్లు అవుతుందని, ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదని మారా చెప్పారు. పంచయతీ ఎన్నికల సందర్భంగా ఈ భూముల విషయం ప్రస్తావనకు వస్తుందని, ఆ తర్వాత ఎవరు మళ్లీ దాని ఊసెత్తరకి ఆమె ఆరోపించారు. కాయకస్టం చేసుకొని బతికే తమకు పక్కా ఇళ్లు కూడా కట్టిస్తామని చెప్పి, పట్టించుకోవడం లేదని రమా విమర్శించారు. రాహుల్‌ గాంధీ వస్తే ఆయన దృష్టికి తాము ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తీసుకెళతామని ఆమె అన్నారు. 

రాహుల్‌ గాంధీకే ముస్లింల ఓటు
కేరళ రాష్ట్రంలో ఇంతవరకు 22 సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉండగా, 13 సంకీర్ణ ప్రభుత్వాల్లో ముస్లింలు భాగస్వాములుగా కొనసాగారు. కారణం ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండడమే కారణం. జనాభా లెక్కల ప్రకారం 45 శాతం మంది ముస్లింలు ఉండగా, 41 శాతం మంది హిందువులు, 13 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. ముస్లింలలో ఎక్కువ మంది రాహుల్‌ గాంధీవైపే మొగ్గు చూపుతున్నప్పటికీ ఆయన అమేథిని వదులుకొని వాయనాడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తానంటే ఆయనకు ఓటు వేస్తామని, లేదంటే లేదని కొంత మంది యువకులు అంటున్నారు. కేరళలోని 20 లోక్‌సభ సీట్లకు ఏప్రిల్‌ 23వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top