
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీయడంతోపాటు విదేశాల్లో పెరుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సాక్షాత్తు నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. దేశంలో దాదాపు 3.75 లక్షల కోట్ల రూపాయల నల్లడబ్బు, విదేశాల్లో దాదాపు లక్ష కోట్ల రూపాయల నల్ల డబ్బు ఉందని అప్పటివరకున్న అధికారిక అంచనా. విదేశాల్లో పేరుకుపోతున్న నల్లడబ్బును తీసుకరావడానికి ఆయన ప్రభుత్వం ‘అన్ డిస్‌క్లోజ్డ్ ఫారిన్ ఇన్‌కమ్ అండ్ అసెట్స్ (ఇంపోజిషన్ ఆఫ్ టాక్స్) బిల్లు–2015’ను తీసుకొచ్చింది. దీన్ని 2015, మే 13వ తేదీన లోక్‌సభ ఆమోదించింది. ఇక నల్లడబ్బు దాచుకోవడానికి స్వర్గధామాలుగా ఘనతికెక్కిన దేశాల ఆటలు సాగవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బిల్లుపై వ్యాఖ్యానించారు. ఈ చట్టం చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఈ బిల్లు పట్ల విమర్శకులు పెదవి విరిచారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్న లక్షల కోట్ల నల్లడబ్బును వదిలేసి విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెస్తారట అంటూ వారు విమర్శించారు. మొదట దేశంలోని నల్లడబ్బును వెలికితీస్తే ఏ మార్గాల్లో నల్లధనం దేశ సరిహద్దులు దాటిందో తెల్సిపోతుందని కూడా నిపుణులు సూచించారు. అప్పటికప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో బిల్లును తీసుకొచ్చి అదే రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అదే బినామీ లావాదేవీల నిరోధక బిల్లు. బినామీ అనేది ఉత్తరాది మాట. ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు చెల్లించిన వారిపైన కాకుండా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు లేదా నకిలీ వ్యక్తుల పేరిట లావా దేవీలు జరుగకుండా నివారించడం. ఇంతకుముందు ఇలాంటి చట్టం ఉండగా, శిక్షలు పెంచుతూ ఆ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు.
బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, లేదా బినామీ ప్రాపర్టీకి మార్కెట్ ధరనుకట్టి అందులో 25 శాతాన్ని జరిమానా విధించడం, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించడం లాంటి అంశాలను బిల్లులో కొత్తగా చేర్చారు. అంతకుముందు జరిమానాగానీ, నాలుగేళ్ల వరకు జైలుగానీ ఏదో ఒకటే విధించే అవకాశం ఉండగా, ఇప్పుడు రెండు శిక్షలు విధించే ప్రతిపాదనలు తీసుకొచ్చారు. శిక్షలు కఠినంగా ఉన్నాయన్న కారణంగా ఈ బిల్లును ఆర్థిక శాఖకు సంబంధించిన పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. ఈ బిల్లుపైనా అసోచమ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని, విదేశాల్లోని నల్లడబ్బును తీసుకురావడానికి మన దేశంలో చట్టాలు లేక కాదు. చట్టాలను అమలుచేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి, అధికారులకు లోపించడమే. పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్)–2002, ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్)–1999లలోపాటు 1961 నాటి ఆదాయం పన్ను చట్టం కూడా ఉంది. వీటిని సక్రమంగా, చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ మూడు చట్టాలను అమలు చేసే యంత్రాంగంలో ఎప్పుడూ అధికారుల కొరతే! ఎందుకు?
స్విస్ బ్యాంకుల్లో ఎక్కువ మంది భారతీయులు నల్లడబ్బు దాచుకుంటున్నారని సామాన్యులకు కూడా తెలిసిన నేపథ్యంలో ఆ దేశంతో నల్లడబ్బు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టడం కోసం కృషి చేసినట్లు పాలకులు నటించారే తప్ప నిజంగా కృషి చేయలేదు. చివరకు భారత్‌లో కేసులు నమోదైన నిందితులకు సంబంధించిన ఖాతాల వివరాలను అందించేందుకు అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్యాంకులు భారత్‌లో ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం కూడా 2018 సంవత్సరంలో అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు నల్ల కుబేరులు సర్దుకోరా? అదే అమెరికా, తన దేశ పౌరుల ఖాతా వివరాలను అందజేయాల్సిందిగా కోరితే ఆగమేఘాల మీద, అంటే క్షణాల మీద అందజేస్తాయి.
ఖాతాల వివరాలను అందజేయనందుకు గతంలో ఎనిమిది స్విస్ బ్యాంకులకు అమెరికా న్యాయవ్యవస్థ 130 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. నోరు మూసుకొని జరిమానా చెల్లించిన ఆ బ్యాంకులు ఇప్పుడు అమెరికా అడిగిన వివరాలను క్షణాల మీద అందజేస్తాయి. నల్లడబ్బులో అమెరికా పౌరుడికి సహకరించారన్న ఆరోపణలపై తమను నిందితులుగా చేర్చి అమెరికా విచారిస్తుందన్నది స్విస్ బ్యాంకు యజమానుల భయం. అలాంటి భయంగానీ, భక్తిగానీ భారత దేశం పట్ల వారికి ఎందుకు లేదు? ఏమైనా గట్టిగా మాట్లాడితే ఆయా దేశాలతో మనకు అలాంటి ఒప్పందాలు లేవని మన పాలకులు చెబుతుంటారు. మోదీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో గతంలో ఏ ప్రధానమంత్రి తిరగనన్ని దేశాలు తిరిగారు. నల్లడబ్బును వెలికితీస్తానని ప్రతిజ్ఞ చేసిన ఆయన తన పర్యటనల సందర్భంగా విదేశాలతో అవసరమైన ఒప్పందాలు చేసుకోవచ్చుగదా!