మోదీ బడ్జెట్లో కొత్త ‘ప్రణాళిక’? | There is a new plan in Modi budget? | Sakshi
Sakshi News home page

మోదీ బడ్జెట్లో కొత్త ‘ప్రణాళిక’?

Jan 31 2017 4:39 AM | Updated on Aug 21 2018 9:33 PM

మోదీ బడ్జెట్లో కొత్త ‘ప్రణాళిక’? - Sakshi

మోదీ బడ్జెట్లో కొత్త ‘ప్రణాళిక’?

నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ తేదీనే కాకుండా... బడ్జెట్‌ స్వరూప స్వభావాలను కూడా మార్చేసే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

  • ప్రణాళిక– ప్రణాళికేతర వ్యయాలుండవు
  • ఉమ్మడి పద్దు కిందే పథకాలపై  కేంద్రం వ్యయాలు
  • నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ తేదీనే కాకుండా... బడ్జెట్‌ స్వరూప స్వభావాలను కూడా మార్చేసే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఫిబ్రవరి నెలలో చివరి రోజున బడ్జెట్‌ పెట్టడమనేది సంప్రదాయం. కానీ ఈ సారి ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. ఇప్పటి వరకూ బడ్జెట్‌ వ్యయాలను ప్రణాళిక, ప్రణాళికేతర అంశాలుగా విభజించి నిధుల కేటాయింపులు జరిపేవారు. ప్రణాళిక అంటే మౌలిక సదుపాయాల వంటి ఆస్తుల కల్పనపై పెట్టే ఖర్చన్న మాట. ప్రణాళికేతరమంటే జీతాల వంటి నిర్వహణ ఖర్చు. అయితే వచ్చే బడ్జెట్‌లో ఇలా కాకుండా, ప్రణాళిక– ప్రణాళికేతర వ్యయాలను ఉమ్మడి పద్దు కిందే చూపించి వివిధ రంగాలకు నిధుల కేటాయింపు జరిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆర్థికాభివృద్ధికి కొత్త రూపును ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.     
    – న్యూఢిల్లీ


    ఇప్పటి వరకూ ఇలా...
    తమ శాఖలకు సంబంధించిన ఖర్చుల గురించి మంత్రులంతా నివేదికలు సమర్పించడంతో బడ్జెట్‌ తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.  ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయమని రెండు రకాలుగా ఈ నివేదికలు ఉంటాయి. ప్రణాళిక వ్యయం విషయానికి వస్తే... అప్పటికే అమలుచేస్తున్న పథకాలతో పాటు నిధుల లభ్యతను అనుసరించి ఇంకా ఏమైనా కొత్త పథకాలు అమలు చేయొచ్చా అన్న అంశం ప్రాతిపదికన ఈ వ్యయ గణాంకాలు రూపొందుతాయి. ప్రణాళికేతర వ్యయం విషయానికి వస్తే,  ఇందులో మెజారిటీ శాతం వడ్డీలు, సబ్సిడీలు, ఉద్యోగుల జీతాలు చెల్లింపులుంటాయి. సోదాహరణంగా చెప్పాలంటే, పాఠశాల నిర్మాణం ప్రణాళికా వ్యయం కిందకు వస్తే, ప్రణాళికేతర వ్యయం పరిధిలోకి పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల వేతనాలు వస్తాయి.

    కొత్త విధానం ఇలా ఉండొచ్చు!
    అత్యున్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం– ఈ సారి బడ్జెట్‌ పత్రాలు కొత్త రూపంలో దర్శనమివ్వబోతున్నాయి. ప్రణాళిక–ప్రణాళికేతర వ్యయ విభాగాలు ఒకటిగా కలిసిపోతాయి. ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి తాజా విధానం ఎలా ఉండబోతుందన్న అంశంపై ‘ఒక మార్గదర్శక పత్రం’ ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు అందింది.  దీని ప్రకారం నాలుగు రూపాల్లో ప్రభుత్వ వ్యయాలు జరుగుతాయి. సాధారణ, సామాజిక, ఆర్థిక విభాగాలతో పాటు ఇతరాలు కింద నిధుల కేటాయింపులు జరుగుతాయి.

    ఈ మార్పు ఎందుకంటే..?
    ► దీనివల్ల నిధుల కేటాయింపు, వినియోగం సహా పలు అంశాల్లో సంక్లిష్టత తొలగిపోతుందని, ఆయా రంగాలకు తగిన రీతిలో డబ్బు అందడం సాధ్యమవుతుందని కేంద్రం విశ్వసిసోంది.
    ► ప్రస్తుతం పలు సందర్భాల్లో ప్రణాళిక వ్యయాలపైనే దృష్టి అధికంగా ఉంటోంది. నిర్వహణకు సంబంధించిన వ్యయాలపై కొంత దృష్టి తగ్గుతోందన్న వాదనకు తాజా నిర్ణయం తెరదింపుతుందని కేంద్రం భావిస్తోంది.
    ► ప్రణాళిక వ్యయాలకు అనుగుణంగా ఒక ఆస్తిని సృష్టిస్తే– దాని నిర్వహణ సరిగాలేక ఆ అసెట్‌పై చేసిన వ్యయం వృధాగా అభివృద్ధి రహిత వ్యయంగా మారుతోందన్న విమర్శ ఉంది. మరొక మాటలో చెప్పాలంటే... ప్రణాళిక వ్యయం కింద పాఠశాల నిర్మిస్తే... నాన్‌ ప్రణాళికా వ్యయాలు సరిగా లేకపోయినా, వినియోగం సరిగా జరక్కపోయినా (ఉపాధ్యాయులు లేకపోయినా లేక నిర్వహణ విధిగా జరక్కపోయినా) మొత్తం వ్యయాలు వృధాగా మారిపోతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement