
విచారణ ఖైదీలను విడుదల చేయండి
విచారణ ఎదుర్కొంటూ జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలను సుప్రీం కోర్టు కనికరించింది.
సుప్రీం కోర్టు ఆదేశం
స్యూరిటీలు, బాండ్లు ఇవ్వలేని పేద ఖైదీలకు ఊరట
న్యూఢిల్లీ: విచారణ ఎదుర్కొంటూ జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీలను సుప్రీం కోర్టు కనికరించింది. నేరం రుజువైతే పడే శిక్షా కాలంలో ఇప్పటికే సగం కాలం జైళ్లలో గడిపిన అండర్ ట్రయల్ ఖైదీలందర్నీ వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఆదేశించింది. 60 శాతంపైగా అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. వారిని విడుదల చేసే పనిని కింది స్థాయి జ్యుడీషియల్ అధికారులకు అప్పగించింది. అక్టోబర్ 1 నుంచి రెండు నెలల్లోపు వారానికి ఒక రోజు వారి పరిధిలోని ప్రతీ జైలును సందర్శించి అలాంటి ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆ అధికారులను ఆదేశించింది. ఖైదీలను గుర్తించే పనిని చేపట్టే జ్యుడీషియల్ అధికారులు (మెజిస్ట్రేట్/సెషన్స్ జడ్జి/ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్) సీపీసీ సెక్షన్ 436ఏను అనుసరించి జైల్లోనే నిర్ణయం తీసుకుని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయాలని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలో జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహిన్‌టన్ ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో స్యూరిటీలు ఇవ్వలేక, బెయిల్ బాండ్లకు డబ్బులు చెల్లించలేక జైళ్లలోనే ఉండిపోతున్న నిందితులకు విముక్తి లభించనుంది. దేశ వాప్తంగా దాదాపు 3.81 లక్షల మంది ఖైదీలు ఉన్నారని, వారిలో 2.54 లక్షల మంది అండర్ ట్రయల్స్‌గానే ఉన్నారని అంచనా. చాలా కేసుల్లో నిందితులు నేరం రుజువై శిక్ష అనుభవించే కాలం కంటే అండర్ ట్రయల్స్‌గానే ఎక్కువ కాలం జైళ్లలో మగ్గుతున్నారు. అలాంటి వారందరికీ సుప్రీం తీర్పు ఊరటనిచ్చింది. నిందితుల విడుదలపై జ్యుడీషియల్ అధికారులు తమ నివేదికను సంబంధిత హైకోర్టు రిజస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలని, తర్వాత వారు ఆ నివేదికను సుప్రీం కోర్టు జనరల్ సెక్రటరీకి పంపాలని ధర్మాసనం పేర్కొంది.
ఫాస్ట్ ట్రాక్ తీర్పులకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేయండి
కేసుల విచారణలో ఆలస్యానికి కారణమవుతున్న మౌలి క సదుపాయాల లేమిపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. తీర్పుల వెలువరించే విధానాన్ని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను తమ ముందుంచాలని కేంద్రాన్ని శుక్రవారం ఆదేశించింది. ఈ బ్లూ ప్రింట్ సమర్పించడానికి చీఫ్ జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి మూడు నెలల సమయమిచ్చింది.