
18 నుంచి వర్షాకాల సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల కమిటీ తేదీలను ఖరారు చేసింది.
ఎజెండాలో అగ్రస్థానంలో జీఎస్టీ బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల కమిటీ తేదీలను ఖరారు చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంటు వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ప్రకటించారు. ఇప్పటివరకు 20 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరపాలని నిర్ణయించామని.. అవసరాన్ని బట్టి రెండుమూడు రోజులు కుదించడం గాని, పెంచడం గాని చేస్తామన్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు వెంకయ్యనాయడు తెలిపారు. అణు సరఫరా దేశాల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు తదితరాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తితే తాను వాటికి సమాధానం చెబుతానని సుష్మా స్వరాజ్ ముందుకొచ్చారని వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రతిష్టాత్మకమైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) బిల్లు పాసవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్ ఆర్థికంగా మరింత వృద్ధి చెందుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లు ఆమోదానికి సహకరించాలన్నారు. రాజ్యసభలో 45 బిల్లులు, లోక్‌సభలో 11 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బినామీ లావాదేవీల నిరోధక సవరణ బిల్లు, వినియోగదారుల సంరక్షణ బిల్లులతో సహా మెజారిటీ బిల్లులకు ఈసారి మోక్షం లభిస్తుందన్నారు.