రఫేల్‌ ఒప్పందం సక్రమమే

Supreme Court Judgement on Rafale Defence Deal - Sakshi

భారీ అవకతవకలు జరిగినట్లు కనిపించడం లేదు

చిన్న పొరపాట్లకు ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన పనిలేదు

విలేకరుల సమావేశాల్లో వ్యాఖ్యల ఆధారంగా న్యాయసమీక్ష చేయలేం

రఫేల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పెద్ద ఊరట. రఫేల్‌ ఒప్పందంపై కేంద్రం తీరును సమర్థిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగినట్లు తమకు కనిపించడం లేదని స్పష్టం చేసింది. విమానాల కొనుగోలుకు నిబంధనలను అనుసరించి రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానాల (డీపీపీ) ప్రకారమే మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని పేర్కొంది. ఈ ఒప్పందం లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ గత కొన్ని నెలలుగా పదేపదే ఆరోపిస్తుండటం తెలిసిందే. రఫేల్‌ ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ వచ్చిన 36 పిటిషన్లను సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది.

‘ప్రభుత్వ నిర్ణయాన్ని సందేహించాల్సినం తగా మాకు ఈ ఒప్పందంలో తప్పులేవీ కనిపించడం లేదు’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్కే కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం తెలిపింది. ఒకవేళ చిన్నచిన్న పొరపాట్లేమైనా ఈ ఒప్పందంలో జరిగి ఉంటే అవి ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన లేదా క్షుణ్నంగా పరిశీలించాల్సినంత పెద్ద తప్పులేమీ కాదని పేర్కొంది. ఈ తీర్పు అద్భుతమనీ, చాలా మంచి తీర్పనీ, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లుగా ఉందని కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అన్నారు. కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్, తదితరులు రఫేల్‌ ఒప్పందంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం తెలిసిందే. 
 
ధరలను పోల్చడం మా పని కాదు.. 
యూపీఏ హయాంలో కొనుగోలుకు ప్రతిపాదించిన యుద్ధ విమానాలు, బీజేపీ ప్రభుత్వం కొంటున్న యుద్ధ విమానాల ధరలను పోల్చి చూడటం తమ పని కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వివరాలను రహస్యంగానే ఉంచాలంది. కేవలం విలేకరుల సమావేశాల్లో కొందరు చేసిన వ్యాఖ్యలు లేదా ఇచ్చిన సలహాల ఆధారంగా ఈ ఒప్పందంపై న్యాయ సమీక్ష చేయలేమనీ, అందునా ఆ వ్యాఖ్యలు లేదా సలహాలను ఇరు దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు మళ్లీ వాటిపై న్యాయ సమీక్ష జరపడం కుదరదని ధర్మాసనం తెలిపింది. భారత ప్రభుత్వ బలవంతంతోనే రిలయన్స్‌ను డసో ఏవియేషన్‌ ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా ఎంపిక చేసుకుందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ కొన్ని నెలల క్రితం ఫ్రెంచి మీడియాతో చెప్పడం తెలిసిందే.

‘యూపీఏ హయాంలో అనుకున్నట్లుగా 126 యుద్ధ విమానాలనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని మేం బలవంతం చేయలేం. ఈ అంశంలో కోర్టు ప్రభుత్వానికి పై అధికారిగా వ్యవహరిస్తూ ఒప్పందం, విమానాల సేకరణకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలించడం సరికాదు’అని న్యాయమూర్తులు 29 పేజీలో తీర్పులో పేర్కొన్నారు. భారత వాయుసేనకు ఆధునిక విమానాలు కావాలనీ, శత్రుదేశాలు నాల్గో, ఐదో తరం యుద్ధ విమానాలను కూడా కలిగి ఉన్నందున మన వైమానిక దళానికి కూడా ఆధునిక విమానాలు కావాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అలా కాకుంటే మనం విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడం లేదా అసంపూర్తిగా సిద్ధం అవడం కిందకు వస్తుందన్నారు. (రఫెల్‌పై వెనక్కి తగ్గేదిలేదు)
 
రిలయన్స్‌ ఎంపికలో ప్రభుత్వ పాత్ర లేదు.. 
రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి పిటిషనర్ల ఆరోపణల్లోని ప్రధానంగా మూడు అంశాలపై విచారణ జరిపామని సుప్రీంకోర్టు తెలిపింది. వాటిలో ఒకటి ప్రభుత్వ నిర్ణయం, రెండోది విమానాల ధరలు కాగా ఇక మూడోది భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామి ఎంపిక ప్రక్రియ అని పేర్కొంది. ఈ మూడు అంశాలను పరిశీలించిన మీదట ఈ సున్నితమైన కేసులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తమకు అనిపించలేదని న్యాయూర్తులు అన్నారు. రఫేల్‌ విమానాలను ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్‌ కంపెనీ తయారు చేస్తుండగా భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా రిలయన్స్‌ను ఆ కంపెనీ ఎంపిక చేసుకోవడం తెలిసిందే.

మోదీ ప్రభుత్వ ఒత్తిడితోనే విమానాల తయారీలో అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ను కాదని కొత్త సంస్థ రిలయన్స్‌ డిఫెన్స్‌ను డసో ఏవియేషన్‌ను తమ ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా ఎంపిక చేసుకుందని ఆరోపణలున్నాయి. అయితే ఇందుక తగ్గ ఆధారాలేవీ లేవనీ, ప్రభుత్వం వాణిజ్యపరంగా ఆశ్రిత పక్షపాతం చూపిందని నిరూపించేలా సాక్ష్యాలేవీ లేవని కోర్టు పేర్కొంది. ఒప్పందం ప్రకారం ఆఫ్‌సెట్‌ భాగస్వామి ఎంపిక నిర్ణయం అసలు ప్రభుత్వం చేతుల్లోనే లేదని ధర్మాసనం తెలిపింది.



Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top