జర్నలిస్టుల సమస్యలపై వేగంగా స్పందించాలి

Sitaram Yechury on Journalists problems  - Sakshi

ప్రభుత్వాలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచన

సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా పరిగణిస్తున్న జర్నలిజాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, ఆరోగ్య, నివాస భద్రత కల్పించాలని టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో మంగళవారం పార్లమెం టు స్ట్రీట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నాలుగేళ్లలో అసహజ కారణాలతో మరణించిన 220 మంది జర్నలిస్టులపై రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు వేగంగా స్పందించాలని ఏచూరి సూచించారు.

తెలంగాణలో చోటుచేసుకుంటున్న జర్నలిస్టుల అసహజ మరణాలు దేశంలో ఎక్కడా ఇంత పెద్ద సంఖ్యలో లేవన్నారు. జర్నలిజం కత్తిమీద సాములాంటిదని, వారి సమస్యలను కారుణ్య దృష్టితో చూడరాదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. పని ఒత్తిడితో అనారోగ్యం బారిన పడి, ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య కార్డులు పనిచేయక, సరైన వైద్యం అందకపోవడంతో 220 మంది జర్నలిస్టులు చనిపోయారని ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ అన్నారు. జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ ఎత్తేయడం వల్ల ఢిల్లీకి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు.

జర్నలిస్టుల వైద్య సదుపాయాలపై ప్రభు త్వ ప్రకటనలు బూటకంగా కనిపిస్తున్నాయని ఐజేయూ నేత కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నాకు సీపీఐ జాతీయ నేత డి.రాజా సంఘీభావం తెలిపారు. ధర్నాలో ఐజేయూ అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ సిన్హా, ఐఎఫ్‌జే ఉపాధ్యక్షురాలు సబీనా ఇంద్రజిత్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.శేఖర్, ప్రధాన కార్యదర్శి అలీ, ఐజేయూ కౌన్సిల్‌ సభ్యుడు పి.ఆంజనేయులు, తెలంగాణలోని 31 జిల్లాల యూనియన్‌ అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు.  

వాస్తవాలపై దృష్టి సారించాలి: ఉపరాష్ట్రపతి
మీడియా సంచలనాలపై కాకుండా వాస్తవాలున్న వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ధర్నా అనంతరం ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతలు ఉపరాష్ట్రపతిని కలసి జర్నలిస్టుల సమస్యలను ఆయ న దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కేంద్ర సమాచార మంత్రిని పిలిపించి చర్చిస్తానని ఆయన హామీనిచ్చా రు.

జర్నలిస్టుల సంక్షేమంపై యాజమాన్యాలూ దృష్టి సారించాలని, అప్పుడే వారు నిజాయితీగా స్వేచ్ఛగా పనిచేయగలుగుతారన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనకు ప్రభుత్వాలే కాకుండా మీడియా కూడా గ్రామాలు, వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. ఉపరాష్ట్రపతిని కలసినవారిలో ఎస్‌ఎన్‌ సిన్హా, దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్‌రెడ్డి, సబీనా ఇంద్రజిత్, నారాయణరెడ్డి, ఎంఎ మజీద్, కృష్ణారెడ్డి తదితరులున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top