‘బీజేపీ పగటికలలు నెరవేరవు’

Shiv Sena Asserted That Coalition Government In Maharashtra Is Not Facing Any Threat  - Sakshi

ముంబై : జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్‌లో నెలకొన్న పరిణామాలపై శివసేన స్పందించింది. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌కు ఎలాంటి ముప్పూ లేదని, కాంగ్రెస్‌-ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్‌ ఠాక్రే మహా సర్కార్‌ను సమర్ధవంతంగా నడిపిస్తున్నారని పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ తమ యువనేతలను కలుపుకునిపోవడంలో విఫలమవుతోందని శివసేన పత్రిక సామ్నా ఎడిటోరియల్‌ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోస్తామన్న బీజేపీ పగటికలలను మానుకోవాలని సామ్నా సంపాదకీయం ఎద్దేవా చేసింది. మహారాష్ట్రలో అస్ధిరత కోసం మూడు నెలల కిందట బీజేపీ చేసిన విఫల ప్రయోగం గుర్తుకుతెచ్చుకోవాలని సూచించింది.

ఇక మధ్యప్రదేశ్‌ పరిణామాలపై కాంగ్రెస్‌ తీరునూ తప్పుపట్టింది. మధ్యప్రదేశ్‌లో సీనియర్‌ నేతలు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌లు సమన్వయంతో సర్కార్‌ను నడుపుతున్నా జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలను నిర్లక్ష్యం చేసి పొరపాటు చేసిందని ఎత్తిచూపింది. సీనియర్‌ నేతగా పేరొందిన కమల్‌నాథ్‌ను తక్కువగా అంచనా వేయలేమని మహారాష్ట్ర తరహాలో మధ్యప్రదేశ్‌లోనూ ఆయన బీజేపీకి షాక్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొంది. ఇక రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌ల సీఎంలు కమల్‌నాథ్‌, అశోక్‌ గెహ్లోత్‌ల సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకుందని సామ్నా సంపాదకీయం ప్రస్తావించింది. 

చదవండి : ‘ఆ వైరస్‌ మాకు సోకదు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top