'షారూఖ్‌ ఖాన్ ను అడ్డుకోలేదు' | Shah Rukh Khan DU protest was not by us, claims ABVP | Sakshi
Sakshi News home page

'షారూఖ్‌ ఖాన్ ను అడ్డుకోలేదు'

Feb 17 2016 3:06 PM | Updated on Sep 3 2017 5:50 PM

'షారూఖ్‌ ఖాన్ ను అడ్డుకోలేదు'

'షారూఖ్‌ ఖాన్ ను అడ్డుకోలేదు'

బాలీవుడ్ హీరో షారూఖ్‌ ఖాన్ ను తాము అడ్డుకోలేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) తెలిపింది.

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో షారూఖ్‌ ఖాన్ ను తాము అడ్డుకోలేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) తెలిపింది. షారూఖ్‌ కు అడ్డుకునేందుకు ప్రయత్నించలేదని, ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆందోళనలు నిర్వహించలేదని వెల్లడించింది. ఢిల్లీలోని హన్స్ రాజ్ కాలేజీ నుంచి షారూఖ్ మంగళవారం డిగ్రీ పట్టా తీసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన 28 ఏళ్ల తర్వాత పట్టా అందుకున్నారు.

యశ్ రాజ్ బ్యానర్ లో వస్తున్న 'ఫ్యాన్' సినిమా పాట విడుదల సందర్భంగా హన్స్ రాజ్ కాలేజీకి వచ్చిన షారూఖ్ కు వ్యతిరేకంగా కాలేజీ బయట ఏబీవీపీ ఆందోళన చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని హన్స్ రాజ్ కాలేజీ ఏబీవీపీ అధ్యక్షుడు ఇష్విందర్ పాల్ సింగ్ అన్నారు. కొంతమంది తాగుబోతులు గలాబా సృష్టించారని, దీంతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.

'మేము ఎటువంటి నిరసనలు చేపట్టలేదు. అవన్నీ ఊహాగానాలు. కాలేజీ బయట కొంతమంది తాగుబోతులు అనుచితంగా ప్రవర్తించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్ ప్రశాంతంగా ఉంది. ఏబీవీపీ ఎటువంటి సమస్యలు సృష్టించలేద'ని ఇష్విందర్ తెలిపారు. అయితే షారూఖ్ ఖాన్ రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారని, వారిని నియంత్రించడం తమకు చాలా కష్టమైందని కృష్ణకుమార్ అనే పోలీసు వెల్లడించారు. తగినవిధంగా సెక్యురిటీ ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement