జ్యుడీషియల్‌ యాక్టివిజానికి సై...!

Ranjan Gogoi To Is To Take Charge As Chief Justice Of India - Sakshi

న్యాయవ్యవస్థలో కీలక మార్పుల వైపు ప్రస్థానం...

భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణకు కొన్ని రోజుల ముందు పలు చరిత్రాత్మక తీర్పులతో న్యాయవ్యవస్థ క్రియాశీలతను జస్టిస్‌ దీపాక్‌ మిశ్రా నిరూపించారు. ఆయన తర్వాత పదమూడున్నర నెలల పాటు ఆ బాధ్యతలు నిర్వహించనున్న జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ కూడా తనదైన పంథాలో న్యాయవ్యవస్థలో కీలకమార్పులకు నాందిగా నిలుస్తారనే అభిప్రాయ వ్యక్తమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి సర్వోన్నత న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తిగా  గొగొయ్‌ అరుదైన రికార్డ్‌ సాధించారు. న్యాయపరమైన అంశాలు, కీలకమైన విషయాల్లో దృఢంగా వ్యవహరించడంతో పాటు తన అభిప్రాయాలను సూటిగా, నిష్కర్షగా వెల్లడిస్తారనే పేరుంది. బుధవారం  సుప్రీంకోర్టు 46వ ప్రధానన్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే వివిధ  తీర్పుల రూపంలో ఆయన వైఖరి  ఏ విధంగా ఉండబోతున్నదనేది ఇప్పటికే వెల్లడైంది.  

సీజేగా ఎలా ?
ప్రాధాన్యత సంతరించుకున్న సుప్రీంకోర్టు కేసుల విచారణను తనకు నచ్చిన బెంచ్‌లకు కేటాయించడంతో పాటు,  ఏకపక్షధోరణితో వ్యవహరిస్తున్నారంటూ చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన నలుగురు సీనియర్‌ జడ్జీల్లో గొగొయ్‌ కూడా ఒకరు. ఈ అంశంపై ఏకంగా మీడియా సమావేశాన్నే నిర్వహించి మిశ్రా వైఖరిని ఎండగట్టడం ద్వారా ఈ నలుగురు  సంచలనం సష్టించారు. సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉంటూ ’సీజే హయాంలో సుప్రీంకోర్టు పనితీరు ప్రజాస్వామ్యానికే  ప్రమాదం ఏర్పడేలా ఉంది’ అని వారు బహిరంగ వ్యాఖ్యలు చేయడం సాహసంతో కూడుకున్నవేనని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా ఈ వ్యాఖ్యల ద్వారా గొగొయ్‌ తదుపరి సీజే అయ్యే అవకాశాలు దాదాపుగా కోల్పోయారని భావించిన వారూ ఉన్నారు. దీంతో పాటు పలు  కేసుల్లో విచారణ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, విధానాలపై విమర్శలు చేసిన గొగొయ్‌ నేతత్వంలో సుప్రీంకోర్టు పనితీరు ఏ విధంగా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోధ్య–బాబ్రీ వివాదానికి సంబంధించిన భూమి హక్కు కేసుతో పాటు, అస్సాంలో నేషనల్‌ రిజిష్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) అంశం, ఇప్పటికే సంచలనంగా మారిన ఐదుగురు మానవహక్కుల కార్యకర్తల అరెస్ట్‌  తదితర సంక్షిష్ట కేసుల్లో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పులిస్తుందన్న దానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడనుంది. న్యాయపరమైన అంశాల్లో సునిశిత దృష్టి,  మచ్చలేని జ్యుడీషియల్‌ రికార్డ్, స్వతంత్ర , అంతర్‌దష్టి, సాహసోపేతమైన వైఖరితో గొగొయ్‌ సుప్రీంకోర్టుపై పూర్తి నియంత్రణ సాధిస్తారనే న్యాయవాదవర్గాలు భావిస్తున్నాయి.

కొలీజియం వ్యవస్థ ద్వారా  జడ్జీల నియామకం స్థానంలో నేషనల్‌ జుడిషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ ద్వారా  న్యాయమూర్తుల నియమించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని  సుప్రీంకోర్టు కొట్టేసింది. అదేసమయంలో కొలీజియం పద్ధతిలో కూడా పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికతను కొరవడిందని  ఈ తీర్పు ఇచ్చిన వారిలో ఒకరైన జాస్తి చలమేశ్వర్‌ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థలోని అపరిష్కృతంగా ఉన్న అనేక సందిగ్థా«లు, సంక్షోభాల పరిష్కారానికి  గొగొయ్‌ ఏ విధంగా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది.
 
నేపథ్యమిదీ...
అస్సాంలోని ఉన్నత న్యాయవాద, రాజకీయ కుటుంబంలో జన్మించారు. తండ్రి దివంగత కేశవ్‌చంద్ర గొగొయ్‌ ఓ పర్యాయం అస్సాం సీఎంగా ఉన్నారు. న్యాయవాదిగానూ పేరుగాంచారు. తల్లి శాంతి గొగొయ్‌ సాహితీవేత్త. అట్టడుగువర్గాల అభ్యున్నతికి ’సోషియా ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ (సేవా) ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మమ్మ, తాతయ్యలిద్దరూ కూడా స్వాతంత్య్రానికి ముందు, తర్వాత ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు. ఈ నేపథ్యం నుంచి వచ్చిన గొగొయ్‌ వక్తృత్వ పోటీల్లో వాదనా పటిమను నిరూపించుకున్నారు.  ఫుట్‌బాల్‌ ఆటగాడిగా రాణించారు. నేటీకి చదరంగం క్రీడలో మంచి పట్టుంది.

డిబ్రూగఢ్‌లోని డాన్‌బాస్కో స్కూల్, గువాహటి లోని కాటన్‌ కాలేజీ, ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ, ఢిల్లీ యూనివర్శిటీ ఇలా వివిధస్థాయిల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది.  తొలుత రాజ్యాంగపరమైన అంశాలు, టాక్స్, కంపెనీ లా వంటి అంశాలపై న్యాయవాదిగా పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. 47 ఏళ్ల వయసులో గువాహటి కోర్టు పర్మినెంట్‌ జడ్జీగా నియమితులయ్యారు. 57 ఏళ్ల వయసులో పంజాబ్,హర్యానా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అయ్యారు. 58వ ఏట సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు. అత్య«ధిక కాలం ఏడేళ్లపాటు (దాదాపు 14 నెలల పాటు సీజేగా కలుపుకుని) ఆ బాధ్యతలు నిర్వహించిన  వ్యక్తిగా ఆయన నిలుస్తారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top