టీఆర్‌పీ కోసం మీడియా పాకులాట | Sakshi
Sakshi News home page

టీఆర్‌పీ కోసం మీడియా పాకులాట

Published Mon, Jun 4 2018 2:28 AM

Rajdeep Sardesai Says Fake News Increasing Social Media - Sakshi

హైదరాబాద్‌: ప్రస్తుతం మీడియా రంగంలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువగా ఉంటోందని, గతంతో పోలిస్తే మీడియాలో విలువలు తగ్గిపోతున్నాయని ఇండియా టుడే కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అభిప్రాయపడ్డారు. టీఆర్‌పీ రేటింగ్‌ కోసం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోం దన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ 53వ వ్యవస్థాపక దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి ఎస్‌.విజయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మీడియా ఇన్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ ఎరా’అనే అంశంపై రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఉపన్యసించారు. ప్రస్తుతం మీడియా యాజమాన్యాలు కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎడిటోరియల్‌ కథనాలకు ఎంతో విలువ ఉండేదని, కానీ నేడు అవి రాజకీయ నేతల ప్యాకేజీలుగా మారి పోయాయన్నారు. జర్నలిజాన్ని పెయిడ్‌ న్యూస్‌ ఒక కేన్సర్‌ వ్యాధిలా పట్టిపీడిస్తోందన్నారు.

మరుగున పడిపోతున్న ప్రజా సమస్యలు
ప్రజల సమస్యలపై వార్తలు ప్రసారం చేయడం, ప్రచురించడం తగ్గిపోయిందని రాజ్‌దీప్‌ వాపోయారు. దేశవ్యాప్తంగా 400 చానళ్లు ఉండగా అందులో ఎక్కువ శాతం రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. నేడు ప్రధానులు, ముఖ్యమంత్రులు సైతం కనీసం మీడియాకి ఇంటర్వూలు కూడా ఇవ్వడం లేదని.. ప్రెస్‌మీట్‌లు పెట్టడానికి సైతం ఆసక్తి చూపడం లేదని అన్నారు. గతంలో ఎన్‌టీఆర్‌ లాంటి మహానేతలు ప్రతినిత్యం మీడియాతో కలసిమెలసి ఉండేవారని గుర్తుచేశారు. సంచలనాల కోసమే చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఇంటర్‌నెట్, మొబైల్, వాట్సప్‌ జర్నలిజం పెరిగిపోవడంతో తప్పుడు వార్తలు ప్రసారమవుతున్నాయన్నారు. ఇటీవలి కాలంలో జాతీయ మీడియా కులా లు, మతాలు, ప్రాంతీయ భేదాలతో ప్రజల్ని విడదీసే విధంగా కథనాలు ప్రసారం చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్‌.. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ను ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. జర్నలిజంలో 45 సంవత్సరాలు పూర్తిచేసిన రామచంద్రమూర్తిని, ఐజేయూ అధ్యక్షుడిగా ఎన్నికైన అమర్‌ను, అల్లం నారాయణను రాజ్‌దీప్‌ సత్కరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement