
ఆడ నెమళ్లకు తోడు అక్కర్లేదా?
మగ నెమలిని జాతీయ పక్షిగా గుర్తించినప్పుడు ఆవును మాత్రం జాతీయ జంతువుగా ఎందుకు గుర్తించరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ రాజస్థాన్ జడ్జీ ఎంసీ శర్మ నెమళ్ల గురించి ఓ వింతైన విషయం చెప్పారు.
న్యూఢిల్లీ: మగ నెమలిని జాతీయ పక్షిగా గుర్తించినప్పుడు ఆవును మాత్రం జాతీయ జంతువుగా ఎందుకు గుర్తించరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ రాజస్థాన్ జడ్జీ ఎంసీ శర్మ నెమళ్ల గురించి ఓ వింతైన విషయం చెప్పారు. మగ నెమళ్లు జీవితాంతం బ్రహ్మచారులుగా ఉంటాయని, వాటి కన్నీళ్లను తాగడం ద్వారా ఆడ నెమళ్లలో సంతానోత్పత్తికి బీజం పడుతుందని ఆయన కొత్త విషయం చెప్పారు. ఆడ, మగ నెమళ్లు ఎలా కలసుకుంటాయో జియోగ్రఫికల్ ఛానళ్లు చూసిన వాళ్లు ఇటు జడ్జీ వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులను, అటు నెమళ్ల మేటింగ్ వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి షేర్ చేసుకుంటున్నారు.
మానవ పరిణామ క్రమం సిద్ధాంతాన్ని వివరించిన చార్లెస్ డార్విన్‌కు మగ నెమళ్లకు తోక ఎందుకు అంత పెద్దగా ఉంటుంది, ఎందుకు అంత అందంగా ఉంటుందన్న విషయం ఓ అర్థంకాక అప్పట్లో తలపట్టుకు తిరిగారట. ఆయన రాసిన ‘సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్’ సిద్ధాంతం ప్రకారం పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ జాతి జంతువైనా, పక్షి అయినా మనుగడ సాగిస్తుంది. అలా మనుగడ సాగించలేని జాతులు అంతరించి పోతాయి. లేదా మనుగడ సాగించే జాతుల ఆకతిలో, అవయవాల్లో మార్పులు వస్తాయన్నది ఆయన సిద్ధాంతం. ఆయన 1859లో ‘ది ఆరిజన్ ఆఫ్ స్పీసెస్’ (జాతుల మూలాలు) అంటూ ఓ పుస్తకం కూడా రాశారు.
అప్పుడే ఆయన బుర్రలో ఓ అనుమానం తలెత్తింది. సులువుగా గాలిలోకి ఎగరడానికి, వేగంగా దూసుకుపోవడానికి మగ నెమళ్లకు పొడవైన ఈకలతో కూడిన తోక అడ్డం పడుతోంది. అలా అడ్డం పడుతున్న తోక కాల క్రమంలో ఎందుకు అంతరించి పోవడం లేదన్నది ఆయన అనుమానం. ఈ అనుమానాన్ని నివత్తి చేసుకోవడం కోసం నెమళ్లపై ఆయన మరింత లోతుగా అధ్యయనం జరిపారు. అప్పుడు అసలు విషయం ఆయనకు అర్థం అయింది. మగ నెమళ్ల తోకలను బట్టి ఆడ నెమళ్లు తోడును వెతుక్కుంటాయని తేలింది. పైగా ఆ తోకలు అంత అందంగా ఉండడానికి కారణం కూడా ఆడ నెమళ్లను ఆకర్షించడానికేనని కూడా డార్విన్ అర్థం చేసుకున్నారు. అంటే తోకకు సెక్స్ ప్రయోజనం ఉండడం వల్ల అది అంతరించి పోవడం లేదన్నది ఆయన థియరీ.
మగ నెమళ్లు పురివిప్పి నాట్యం చేసేదే ఆడ నెమళ్లను ఆకర్షించడానికని, ఆడ నెమళ్లు తమ రుతు క్రమాన్నిబట్టి వాటికి స్పందిస్తాయని పక్షి ప్రేమికుడు, పక్షుల అలవాట్లపై పుస్తకాలు రాసిన ప్రముఖ రచయిత బెర్నార్డ్ పియర్స్ బ్రెంట్ మరింత వివరంగా చెప్పారు.