
పెద్దల సభ సహకరించాలి
వస్తు, సేవల పన్ను బిల్లు(జీఎస్టీ) సహా పలు కీలక బిల్లులను ఆమోదించాలని ప్రధాని మోదీ రాజ్యసభ సభ్యులను కోరారు.
♦ రాజ్యసభకు ప్రధాని అభ్యర్థన
♦ జీఎస్టీ సహా కీలక బిల్లుల ఆమోదం అత్యవసరం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను బిల్లు(జీఎస్టీ) సహా పలు కీలక బిల్లులను ఆమోదించాలని ప్రధాని మోదీ రాజ్యసభ సభ్యులను కోరారు. దేశం ప్రగతి పథంలో దూసుకువెళ్లేందుకు ఆయా బిల్లులు చట్టరూపం దాల్చడం అత్యవసరమన్నారు. గత సమావేశాలకు భిన్నంగా ఈ సారి పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగుతుండటంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని.. అందుకు ప్రతిపక్షానికి ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ, ఇతర బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొంది, ప్రభుత్వ పక్షానికి మెజారిటీ లేనందువల్ల రాజ్యసభలో పెండింగ్‌లో ఉండిపోవడం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు బుధవారం ప్రధాని రాజ్యసభలో సమాధానమిచ్చారు.
ఆ తీర్మానానికి విపక్షం చేసిన 3 వందలకు పైగా సవరణలు ప్రతిపాదించడాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రపతి హోదాను, అత్యున్నత సభాసంప్రదాయాలను గౌరవిస్తూ ఆ సవరణలను ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, ప్రధాని అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రతిపాదించిన ఒక సవరణను సభ ఆమోదించింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 10వ తరగతి కనీస విద్యార్హతగా ఉండాలంటూ రాజస్తాన్, హరియాణాలు చట్టాలు చేయడం ప్రజల హక్కుల ఉల్లంఘనేనన్న అంశం రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు రాకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపాదించిన ఆ సవరణకు అనుకూలంగా 94, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి.
రాజ్యసభ విశిష్టతను వివరిస్తూ తన ప్రసంగంలో తొలి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలను ప్రధాని ఉటంకించారు. ‘రాజ్యసభ గొప్ప ఆలోచనలకు వేదిక. పార్లమెంటు వ్యవస్థలో భాగమైన రాజ్యసభ, లోక్‌సభల మధ్య సమన్వయం ఉండాలి’ అన్న నెహ్రూ భావనలను.. అన్ని పెండింగ్ బిల్లులను ఆమోదించడం ద్వారా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వ పథకాలన్నీ తమవేనంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శిస్తూ.. మాజీ ప్రధాని ఇందిర చేసిన వ్యాఖ్యలనూ ప్రస్తావించారు. ‘రెండు రకాల మనుషులుంటారు. ఒకరు పనిచేసే వారైతే.. ఆ ఖ్యాతిని తమ ఖాతాలో వేసుకునేవారు రెండో రకం. మొదటి వర్గంలోనే ఉండటం మంచిది. ఎందుకంటే అక్కడ పోటీ తక్కువ’ అన్న ఇందిర వ్యాఖ్యను ప్రస్తావించారు. మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు..
► ఈ సమావేశాలు సజావుగా సాగుతుండటం వల్ల సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే పనిలో మంత్రులు తలమునకలయ్యారు. ఇది ప్రజాస్వామ్య బలం.
► అభివృద్ధి విషయంలో ఉదాసీన ధోరణి సరికాదు. భారత్ లాంటి పెద్ద దేశం అభివృద్ధికి పూర్తి సామర్థ్యాన్ని వాడాలి.
► ఇది పెద్దల సభ. గొప్పవాళ్లు నడిచే మార్గాన్ని అంతా అనుసరిస్తుంటారు. ఈ సభలో జరిగేవన్నీ లోక్‌సభపై, రాష్ట్రాల అసెంబ్లీలపై ప్రభావం చూపుతాయి.
► ప్రజా ప్రతినిధులు(లోక్‌సభ ఎంపీలు) ఆమోదించిన బిల్లులను రాష్ట్రాల ప్రతినిధులు(రాజ్యసభ సభ్యులు) అడ్డుకుంటున్నారు.
► రాజస్తాన్, హరియాణాల్లోని పంచాయితీ ఎన్నికల్లో కనీస విద్యార్హత చట్టాలను సుప్రీంకోర్టూ ఆమోదించింది. స్వాతంత్య్రానంతరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్లనే నిరక్షరాస్యత ఈ స్థాయిలో ఉంది. కాంగ్రెస్‌కు ధైర్యముంటే రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లను నిరక్షరాస్యులకు ఇవ్వండి.
► జనధన యోజన అమలులో లోపాలను బయటపెట్టిన కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్‌ను ప్రశంసిస్తున్నా.
► ఇసుక మైనింగ్‌లో రాష్ట్రాలకు మరిన్ని అధికారాలిచ్చాం(ఇసుక మైనింగ్ రాష్ట్ర జాబితాలోని అంశమంటూ కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు).
► రైతుల ఆదాయాన్ని 2020నాటికి రెట్టింపు చేయడానికి సహకరించండి. నేను మన్మో హన్‌లా ఆర్థికవేత్తను కాను. అంత జ్ఞానం లేదు. ► రైన దిశలో వెళ్తే అది సాధ్యమే.
విపక్షానికి మోదీ చురకలు..
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గంటకు పైగా చేసిన ప్రసంగం ఆద్యంతం విపక్షంపై ముఖ్యంగా కాంగ్రెస్‌పై వ్యంగ్య విమర్శలు, చురకలతో సాగింది. మారాలని కాంగ్రెస్‌కు సూచిస్తూ ప్రఖ్యాత కవి నిదా ఫాజిలీ రాసిన కవితలోని రెండు పంక్తులను చదివి ప్రసంగాన్ని ముగించారు.
‘ప్రయాణంలో ఎండ వేడిమి ఉంటుంది.. వెళ్లగలిగితే వెళ్లు/ గుంపులో అంతా ఉంటారు.. ముందుకు సాగగలిగితే వెళ్లు.. / ఎవరికోసమో మార్గాలు ఎందుకు మారుతాయి../ నిన్ను నువ్వే మార్చుకోగలిగితే.. ముందుకు సాగు../ ఇక్కడ ఎవరు ఎవరికీ దారివ్వరు..
నన్ను పడదోసి, నిలవగలననుకుంటే.. ముందుకు సాగు’ అనే పంక్తులను మోదీ చదివారు. మరో సందర్భంలో కాంగ్రెస్‌ను మరణంతో పోల్చారు. ‘మరణానికి ఒక అదృష్టం ఉంది. దాన్నెవరూ తప్పుబట్టరు. ఎవరైనా చనిపోతే.. కేన్సర్ అనో, వృద్ధాప్యం అనో ఆ మరణానికి కారణాన్నే తప్పుబడ్తారు కానీ మరణాన్ని తప్పుబట్టరు, నిందించరు. కాంగ్రెస్‌కూ ఈ అదృష్టం ఉందని నాకనిపిస్తూ ఉంటుంది. మేం కాంగ్రెస్‌ను విమర్శిస్తే.. మీడియా దృష్టిలో మేం విపక్షంపై దాడి చేసినట్లు.. అదే మేం జేడీయూనో, బీఎస్‌పీనో విమర్శిస్తే, అది ఆయా పార్టీలపై దాడిగానే మీడియా పేర్కొంటుంది. కాంగ్రెస్ నిందలకు అతీతమా అనిపిస్తుంటుంది. దీనిపై లోతుగా పరిశోధన జరగాల్సి ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుడు మణి శంకర్ అయ్యర్ తనపై చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఆకాశవాణిలో వచ్చే ‘భూలే బిస్రే గీత్’ను ప్రస్తావించారు. ‘త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగుస్తున్న కొందరి నుంచి ఇలా భూలే బిస్రే స్వరాలు వినిపిస్తుంటాయి’ అని ఆయన ఎద్దేవా చేశారు.