breaking news
Motion of thanks
-
పెద్దల సభ సహకరించాలి
♦ రాజ్యసభకు ప్రధాని అభ్యర్థన ♦ జీఎస్టీ సహా కీలక బిల్లుల ఆమోదం అత్యవసరం న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను బిల్లు(జీఎస్టీ) సహా పలు కీలక బిల్లులను ఆమోదించాలని ప్రధాని మోదీ రాజ్యసభ సభ్యులను కోరారు. దేశం ప్రగతి పథంలో దూసుకువెళ్లేందుకు ఆయా బిల్లులు చట్టరూపం దాల్చడం అత్యవసరమన్నారు. గత సమావేశాలకు భిన్నంగా ఈ సారి పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగుతుండటంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని.. అందుకు ప్రతిపక్షానికి ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ, ఇతర బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొంది, ప్రభుత్వ పక్షానికి మెజారిటీ లేనందువల్ల రాజ్యసభలో పెండింగ్‌లో ఉండిపోవడం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు బుధవారం ప్రధాని రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఆ తీర్మానానికి విపక్షం చేసిన 3 వందలకు పైగా సవరణలు ప్రతిపాదించడాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రపతి హోదాను, అత్యున్నత సభాసంప్రదాయాలను గౌరవిస్తూ ఆ సవరణలను ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, ప్రధాని అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రతిపాదించిన ఒక సవరణను సభ ఆమోదించింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 10వ తరగతి కనీస విద్యార్హతగా ఉండాలంటూ రాజస్తాన్, హరియాణాలు చట్టాలు చేయడం ప్రజల హక్కుల ఉల్లంఘనేనన్న అంశం రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు రాకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపాదించిన ఆ సవరణకు అనుకూలంగా 94, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. రాజ్యసభ విశిష్టతను వివరిస్తూ తన ప్రసంగంలో తొలి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలను ప్రధాని ఉటంకించారు. ‘రాజ్యసభ గొప్ప ఆలోచనలకు వేదిక. పార్లమెంటు వ్యవస్థలో భాగమైన రాజ్యసభ, లోక్‌సభల మధ్య సమన్వయం ఉండాలి’ అన్న నెహ్రూ భావనలను.. అన్ని పెండింగ్ బిల్లులను ఆమోదించడం ద్వారా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వ పథకాలన్నీ తమవేనంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శిస్తూ.. మాజీ ప్రధాని ఇందిర చేసిన వ్యాఖ్యలనూ ప్రస్తావించారు. ‘రెండు రకాల మనుషులుంటారు. ఒకరు పనిచేసే వారైతే.. ఆ ఖ్యాతిని తమ ఖాతాలో వేసుకునేవారు రెండో రకం. మొదటి వర్గంలోనే ఉండటం మంచిది. ఎందుకంటే అక్కడ పోటీ తక్కువ’ అన్న ఇందిర వ్యాఖ్యను ప్రస్తావించారు. మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు.. ► ఈ సమావేశాలు సజావుగా సాగుతుండటం వల్ల సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే పనిలో మంత్రులు తలమునకలయ్యారు. ఇది ప్రజాస్వామ్య బలం. ► అభివృద్ధి విషయంలో ఉదాసీన ధోరణి సరికాదు. భారత్ లాంటి పెద్ద దేశం అభివృద్ధికి పూర్తి సామర్థ్యాన్ని వాడాలి. ► ఇది పెద్దల సభ. గొప్పవాళ్లు నడిచే మార్గాన్ని అంతా అనుసరిస్తుంటారు. ఈ సభలో జరిగేవన్నీ లోక్‌సభపై, రాష్ట్రాల అసెంబ్లీలపై ప్రభావం చూపుతాయి. ► ప్రజా ప్రతినిధులు(లోక్‌సభ ఎంపీలు) ఆమోదించిన బిల్లులను రాష్ట్రాల ప్రతినిధులు(రాజ్యసభ సభ్యులు) అడ్డుకుంటున్నారు. ► రాజస్తాన్, హరియాణాల్లోని పంచాయితీ ఎన్నికల్లో కనీస విద్యార్హత చట్టాలను సుప్రీంకోర్టూ ఆమోదించింది. స్వాతంత్య్రానంతరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్లనే నిరక్షరాస్యత ఈ స్థాయిలో ఉంది. కాంగ్రెస్‌కు ధైర్యముంటే రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లను నిరక్షరాస్యులకు ఇవ్వండి. ► జనధన యోజన అమలులో లోపాలను బయటపెట్టిన కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్‌ను ప్రశంసిస్తున్నా. ► ఇసుక మైనింగ్‌లో రాష్ట్రాలకు మరిన్ని అధికారాలిచ్చాం(ఇసుక మైనింగ్ రాష్ట్ర జాబితాలోని అంశమంటూ కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు). ► రైతుల ఆదాయాన్ని 2020నాటికి రెట్టింపు చేయడానికి సహకరించండి. నేను మన్మో హన్లా ఆర్థికవేత్తను కాను. అంత జ్ఞానం లేదు. ► రైన దిశలో వెళ్తే అది సాధ్యమే. విపక్షానికి మోదీ చురకలు.. న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గంటకు పైగా చేసిన ప్రసంగం ఆద్యంతం విపక్షంపై ముఖ్యంగా కాంగ్రెస్‌పై వ్యంగ్య విమర్శలు, చురకలతో సాగింది. మారాలని కాంగ్రెస్‌కు సూచిస్తూ ప్రఖ్యాత కవి నిదా ఫాజిలీ రాసిన కవితలోని రెండు పంక్తులను చదివి ప్రసంగాన్ని ముగించారు. ‘ప్రయాణంలో ఎండ వేడిమి ఉంటుంది.. వెళ్లగలిగితే వెళ్లు/ గుంపులో అంతా ఉంటారు.. ముందుకు సాగగలిగితే వెళ్లు.. / ఎవరికోసమో మార్గాలు ఎందుకు మారుతాయి../ నిన్ను నువ్వే మార్చుకోగలిగితే.. ముందుకు సాగు../ ఇక్కడ ఎవరు ఎవరికీ దారివ్వరు.. నన్ను పడదోసి, నిలవగలననుకుంటే.. ముందుకు సాగు’ అనే పంక్తులను మోదీ చదివారు. మరో సందర్భంలో కాంగ్రెస్‌ను మరణంతో పోల్చారు. ‘మరణానికి ఒక అదృష్టం ఉంది. దాన్నెవరూ తప్పుబట్టరు. ఎవరైనా చనిపోతే.. కేన్సర్ అనో, వృద్ధాప్యం అనో ఆ మరణానికి కారణాన్నే తప్పుబడ్తారు కానీ మరణాన్ని తప్పుబట్టరు, నిందించరు. కాంగ్రెస్‌కూ ఈ అదృష్టం ఉందని నాకనిపిస్తూ ఉంటుంది. మేం కాంగ్రెస్‌ను విమర్శిస్తే.. మీడియా దృష్టిలో మేం విపక్షంపై దాడి చేసినట్లు.. అదే మేం జేడీయూనో, బీఎస్పీనో విమర్శిస్తే, అది ఆయా పార్టీలపై దాడిగానే మీడియా పేర్కొంటుంది. కాంగ్రెస్ నిందలకు అతీతమా అనిపిస్తుంటుంది. దీనిపై లోతుగా పరిశోధన జరగాల్సి ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుడు మణి శంకర్ అయ్యర్ తనపై చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఆకాశవాణిలో వచ్చే ‘భూలే బిస్రే గీత్’ను ప్రస్తావించారు. ‘త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగుస్తున్న కొందరి నుంచి ఇలా భూలే బిస్రే స్వరాలు వినిపిస్తుంటాయి’ అని ఆయన ఎద్దేవా చేశారు. -
పని మాది క్రెడిట్ మీదా!
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో ఛలోక్తులు విసిరారు. ఆ పార్టీకి చెడ్డపేరు ఎప్పుడూ రాదని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే.. అది ప్రతిపక్షాలన్నింటినీ విమర్శించినట్టు ఆపాదిస్తుందని, అంతేకానీ తమను విమర్శిస్తున్నట్టు ఎన్నడూ భావించదని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కొందరు పనిచేస్తే.. మరికొందరు ఆ క్రెడిట్ తీసుకోవడానికి ఉత్సాహపడుతుంటారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆసక్తికరమైన, టాప్ వ్యాఖ్యలివి.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తరహాలో నేను ఆర్థికవేత్తను కాను. నాకు అంత జ్ఞానమూ లేదు. అయినా నాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. 'ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం వారు పనిచేస్తే.. రెండో రకం వారు ఆ పని క్రెడిట్ తమదేనని చెప్పుకొంటూ ఉంటారు. సహజంగానే మొదటి కేటగిరీలో పెద్ద పోటీ ఉండదు' అని ఇందిరాగాంధీ ఓ సందర్భంలో ఈ మాట చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు నేను కృతజ్ఞుడినై ఉంటాను. జన్‌ధన్ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాలు లేని వ్యక్తుల జాబితాను ఆయన సభ ముందు ఉంచారు. బహుశా ఆయన మైక్రోస్కోప్‌తో ఈ పని చేసి ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు కనీసం బైనాక్యూలర్‌తో పనిచేసినా బాగుండేది. స్వచ్ఛత కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారుతోంది. తొలిసారి పార్లమెంటు ఈ అంశంపై చర్చించింది. ఈ చర్చల్లో ప్రభుత్వంపై విమర్శలు రావొచ్చు.. అయినా దీనిపై చర్చ జరుగడం మాత్రం మంచి విషయం. అర్హులకు మాత్రమే ప్రభుత్వ సబ్సీడీలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకానీ డబ్బు పొదుపు చేయడానికి కాదు. మేం జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తున్నాం. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను నేను సమీక్షిస్తున్నాను. ఇందులో కొన్ని ప్రాజెక్టులకు దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇది పెద్దల సభ. ఇందులో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఇక్కడ జరిగిదే ఇతర అసెంబ్లీలపైనా ప్రభావం చూపుతుంది. పార్లమెంటులో ఎన్నో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆమోదించి దేశ ప్రగతికి ఊతమివ్వండి. -
నా ప్రభుత్వ మతం భారత్
ప్రభుత్వ మతవైఖరిని తేల్చి చెప్పిన ప్రధాని మోదీ నా ప్రభుత్వ మతం తొలుత భారత్ (ఫస్ట్ ఇండియా).. మత గ్రంథం భారత రాజ్యాంగం.. ఆరాధన దేశభక్తి.. ప్రార్థన ప్రజాసంక్షేమం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు శుక్రవారం సమాధానమిస్తూ.. తనపై, తన ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ‘మతతత్వ’ విమర్శలకు లోక్‌సభ వేదికగా స్పష్టమైన జవాబిచ్చారు. రాజ్యాంగ పరిధిలో అన్ని మతాలు పరిఢవిల్లాలనే విధానానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. భూసేకరణ బిల్లులో మార్పుచేర్పులకు సిద్ధమని చెబుతూనే.. స్వాతిశయం వీడి సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా.. పేదరిక నిర్మూలనలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఉపాధి హామీ చట్టమే నిదర్శనం అంటూ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. న్యూఢిల్లీ: తనపై, తన ప్రభుత్వంపై పడిన మతతత్వ ముద్రను చెరిపేసే దిశగా తొలిసారి ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులో విస్పష్ట ప్రకటన చేశారు. దేశ సమైక్యత భావనకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజ్యాంగ పరిధిలో అన్ని మతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు శుక్రవారం లోక్‌సభలో బదులిస్తూ గంటంబావు భూసేకరణ బిల్లు సహా అంశాలవారీగా ప్రభుత్వ వైఖరిని తెలిపారు. రైతుల ఆందోళనలను, విపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకుని భూసేకరణ ఆర్డినెన్సు స్థానంలో తీసుకువచ్చిన బిల్లులో మార్పుచేర్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయంలో రాజకీయాలను, స్వాతిశయాన్ని పక్కనబెట్టాలని విపక్షాలకు సూచించారు. మూడు రంగులే కన్పించాలి.. రాజకీయ కారణాలతో మతాన్ని తెరపైకి తేవడం వల్ల దేశం నాశనమైందని, హృదయాలు పగిలిపోయాయని మోదీ అన్నారు. ‘నా ప్రభుత్వ మతం తొలుత భారత్.. నా ప్రభుత్వ మత గ్రంథం భారత రాజ్యాంగం.. నా ప్రభుత్వ ఆరాధన దేశభక్తి. నా ప్రభుత్వ ప్రార్థ ప్రజలందరి సంక్షేమం’ అంటూ కవితాత్మకంగా వివరించారు. భిన్నత్వం నిండిన దేశమిదని, ఇక్కడ తాను మూడు రంగులను(జాతీయ జెండా) తప్ప మరే వర్ణాన్నీ చూడలేదని పేర్కొన్నారు. ‘మతం పేరుతో అవాకులు చవాకులు పేలడాన్ని అనుమతించకపోవడం ప్రధానిగా నా బాధ్యత. మతం పేరుతో వివక్ష చూపే హక్కు, చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు’ అని తేల్చి చెప్పారు. హిందూత్వ సంస్థల మతతత్వ ప్రకటనలను ప్రధాని ఖండించకపోవడంపై వెల్లువెత్తిన విమర్శలను ప్రస్తావిస్తూ.. ‘వారి నోళ్లు మూయించేందుకు నా వద్ద వేయి సమాధానాలున్నాయి. కానీ అర్థంలేని ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ సమయం వృథా చేసుకోదల్చుకోలేదు’ అన్నారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా 2013లో పట్నాలో జరిగిన బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ.. ‘హిందువులు ఎవరితో పోరాడాలి.. ముస్లింలతోనా? లేక పేదరికంతోనా?.. ముస్లింలు ఎవరితో పోరాడాలి.. హిందువులతోనా? లేక పేదరికంతోనా? అని అప్పుడు ప్రశ్నించానని గుర్తు చేశారు. అహంకారం వద్దు.. తన సుదీర్ఘ ప్రసంగంలో.. నల్లధనం, అవినీతి, ఉపాధి హామీ పథకం, బొగ్గు క్షేత్రాల కేటాయింపు.. ఇలా కాంగ్రెస్‌ను విమర్శించేందుకు, యూపీఏ పథకాలను ఎద్దేవా చేసేందుకు లభించిన ఏ అవకాశాన్నీ ప్రధాని వదల్లేదు. తాము తీసుకువచ్చిన భూసేకరణ చట్టమే శ్రేష్టమైనదనే అహంకారాన్ని విడనాడాలని కాంగ్రెస్‌కు సూచించారు. ‘స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాతా దేశంలో నెలకొని ఉన్న పేదరికానికి సజీవ ప్రతీక ఉపాధి హామీ చట్టం. నేనా పథకాన్ని రద్దు చేస్తాననుకుంటున్నారా? నా రాజకీయ జ్ఞానం నన్నలా చేయనివ్వడం లేదు. గత అరవై ఏళ్లుగా పేదరికాన్ని నిర్మూలించలేని మీ వైఫల్యానికి నిదర్శనం ఆ చట్టం. స్వాతంత్య్రం వచ్చి 60ఏళ్లయినా పేదలు గుంతలు తవ్వుతూ ఉండాల్సిందేనని చెప్పే ఆ పథకాన్ని కొనసాగిస్తూనే ఉంటాను’ అని అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య అన్నారు. ప్రధాని ప్రసంగం అనంతరం లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. పేదల కోసం రూపొందించిన చట్టాన్ని అపహాస్యం చేశారంటూ మోదీని ఆక్షేపించారు. ఏళ్లతరబడి మోదీ సీఎంగా ఉన్న గుజరాత్లో ఇంకా పేదరికం ఎందుకు ఉందన్నారు. ఆ తర్తా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రపతి ప్రసంగంలో తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు కోరిన సవరణలను సభ తిరస్కరించింది. సహకరించండి..రాష్ట్రాలకు సాధికారత కల్పిస్తూ సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు, స్వచ్ఛభారత్, జనధన యోజన, అవినీతి, నల్లధనంపై పోరు.. తదితర ప్రభుత్వ పథకాలకు సహకరించాలని ఈ సందర్భంగా ప్రధాని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. భూసేకరణ బిల్లును పరువుప్రతిష్టల అంశంగా తీసుకోవద్దని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ‘మీరు 2013లో భూసేకరణ చట్టాన్ని చేసినప్పుడు పూర్తిగా సహకరించాం. అందులో మీరు రాజకీయ లబ్ధిని ఆశిస్తున్నారన్న విషయం మాకు తెలుసు. అయినా మద్దతిచ్చాం. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలూ ఆ చట్టంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. అది రైతు ప్రయోజనాలకే కాకుండా.. మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఆ చట్టం రక్షణ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని రక్షణ వర్గాలు చెప్పాయి. ఏ అవసరం కోసం భూమిని సేకరిస్తున్నామో చెప్పడం కన్నా ఆ విషయాలు వివరిస్తూ పాకిస్తాన్‌కు లేఖ రాయడం మంచిది అని వారన్నారు. అందుకే అవసరమైన మార్పులతో బిల్లును తీసుకువచ్చాం’ అని వివరించారు. ‘బిల్లులో ఇంకా లోపాలున్నాయని మీరు భావిస్తే.. మా దృష్టికి తీసుకువస్తే మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. రాజకీయ నేతలెఉ కానీ, ఎవరైనా కానీ విదేశాల్లో నల్లధనం అకౌంట్లు ఉన్నవారినీ ఎవరినీ వదలబోమని స్పష్టం చేశారు. అవినీతి రహిత వ్యవస్థను రూపొందించాల్సి ఉందని, అందుకు పార్టీలనీ సహకరించాలని అభ్యర్థించారు. ‘పరస్పర ఆరోపణలతో కాలం గడుపుతూ ఉంటే.. అక్రమ పద్ధతుల్లో డబ్బు సంపాదిస్తున్న వారు అలా సంపాదిస్తూనే ఉంటారు’ అన్నారు. ‘ప్రధాని బాగా మాట్లాడారు..’ ప్రధాని ప్రసంగం అనంతరం లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని బాగా మాట్లాడారని, అయితే మాటలు కడుపు నింపవని, అందుకు చేతలు కూడా అవసరమని ఎద్దేవా చేశారు. అనంతరం, రాష్ట్రపతి ప్రసంగంలో దేశంలో జరుగుతున్న మత హింస ప్రస్తావన ఉండాలంటూ టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ చేసిన సవరణ తీర్మానంపై ఓటింగ్ జరగ్గా 63 మంది సవరణను సమర్ధించి, 203 మంది వ్యతిరేకించగా ఆ తీర్మానం వీగిపోయింది. మతం పేరుతో అవాకులు చవాకులు పేలడాన్ని అనుమతించకపోవడం పధానిగా నా బాధ్యత. మతం పేరుతో వివక్ష చూపే హక్కు, చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. - లోక్‌సభలో ప్రధాని మోదీ -
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం