
సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జలాల పంపిణీపై సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అమలుచేయలేకపోతున్నామని కేంద్రం పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులు తలమునకలవడంతో ఈ అంశంలో జాప్యం జరుగుతోందని కోర్టుకు నివేదించింది. కాగా, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని తమిళనాడు ఆరోపించింది. పదిరోజుల సమయమిస్తే కావేరీ జలాల పంపిణీకి అనువైన పథకానికి రూపకల్పన చేస్తామని కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. దీనికి సంబంధించిన ముసాయిదాను క్యాబినెట్ ముందుంచారని, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి రావడం, అంతకుముందు ప్రధాని చైనా పర్యటనల నేపథ్యంలో జాప్యం జరుగుతోందని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌కు నివేదించారు.
కేంద్రం తీరుపై తమిళనాడు తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శేఖర్ నఫడే అభ్యంతరం వ్యక్తం చేశారు.కేంద్రం ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని..ప్రభుత్వం కర్ణాటకలో ఎన్నికల భవితవ్యంపై ఆందోళన చెందుతోందని అన్నారు. కర్ణాటక ఎన్నికలు మే 12న జరుగుతాయని, అప్పటివరకూ కావేరీ జలాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకోలేదని..ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఇక నెలాఖరులోగా నాలుగు టీఎంసీల నీటిలో ఎంత మేర నీరు విడుదల చేస్తారో తెలపాలని కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కావేరీ జలాలను కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల మధ్య పంపిణీ చేసేందుకు తమ ఉత్తర్వుల అమలు కోసం ఓ పథకం రూపొందించాలన్న తమ తీర్పుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని సుప్రీం కేంద్రాన్ని కోరింది. కేంద్రం ఎలాంటి వ్యవస్థనూ ఏర్పాటు చేయకున్నా తమిళనాడుకు ప్రతినెలా కర్ణాటక కావేరీ జలాలను విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది.