
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో వలస కూలీలకు రవాణా వసతి కల్పించేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయానికి వీలుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) ఆన్‌లైన్ డాష్‌బోర్డు ఏర్పాటు చేసింది. నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎన్‌ఎంఐఎస్) పేరుతో ఎన్‌డీఎంఏ–జీఐఎస్ పోర్టల్‌లో ఈ ఆన్‌లైన్ డాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. వలస కూలీలకు సంబంధించిన సమాచారం రాష్ట్రాలు, జిల్లాల మధ్య ఇచ్చిపుచ్చుకుంటూ వారికి అవసరమైన రవాణా వసతి కల్పించడంలో సమన్వయం చేసుకునేందుకు గాను ఆన్‌లైన్ డేటా క్రోడీకరణకు ఈ డాష్‌బోర్డు వీలు కల్పిస్తుంది.
ఆన్‌లైన్‌లోనే రాష్ట్రాలు, జిల్లాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకునే వీలుంది. అలాగే వలస కూలీల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. ఈనేపథ్యంలో ఈ డాష్‌బోర్డు కోసం వలస కూలీల వివరాలను నమోదు చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శనివారం లేఖ రాశారు. రాష్ట్రాలు ఇప్పటికే వలస కూలీల సమాచారాన్ని సేకరించినందున, బ్యాచుల వారీగా కూలీల వ్యక్తిగత వివరాలను ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.
ఆయా కూలీల పేర్లు, వయస్సు, మొబైల్ నెంబర్, ప్రస్తుతం ఉన్న ప్రాంతం, వెళ్లాలనుకుంటున్న ప్రాంతం, వెళ్లాలనుకుంటున్న తేదీ తదితర వివరాలను రాష్ట్రాలు ఇప్పటికే సేకరిస్తున్నాయి. దీని వల్ల రాష్ట్రాలు ఆయా శ్రామికుల వివరాలపై అంచనాకు వచ్చే వీలుంది. ఎంత మంది వెళుతున్నారు? ఎంత మంది వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారన్న వివరాలు అందుబాటులోకి వస్తాయి. వారికి అవసరమైన ప్రయాణ సదుపాయాలు కల్పించేందుకు వీలుంటుంది. కోవిడ్–19 నేపథ్యంలో వారి కదలికలపై పర్యవేక్షణకు వీలుంటుంది. ప్రతి వలస కూలీకి సంబంధించి ఒక గుర్తింపు నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ఆధారంగానే భవిష్యత్తు లావాదేవీలు జరుపుతారు. వలస కూలీల కదలికలపై ఈ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా పర్యవేక్షణకు వీలు కలుగుతుంది.