ప్రజలు పొగాకుకు దూరంగా ఉండాలి : మోదీ

Narendra Modi Urges People To Quit Tobacco In His Mann Ki Baat - Sakshi

న్యూఢిల్లీ : దేశ ప్రజలు పొగాకుకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్‌ కీ బాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇ సిగరెట్లు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ గురించి  ప్రస్తావించారు. అలాగే దేశ ప్రజలకు నవరాత్రి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రి దేశ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే తను అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్‌తో మాట్లాడే అవకాశం లభించిందని మోదీ పేర్కొన్నారు. లతాజీ 90వ వసంతంలోకి అడుగుపెడుతున్నారని.. ఆమెను మనం దీదీ అని సంబోధించాల్సి ఉందన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సిగరెట్లు చాలా ప్రమాదకరమైనవి. ఆరోగ్యం మీద ఇవి చెడు ప్రభావాన్ని చూపుతాయి. పొగాకు వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టం. పొగాకు బారిన పడిన చాలా మంది క్యాన్సర్‌, బీపీ, డయాబెటిస్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత మానసిక ఎదుగుదల మీద ఇది చెడు ప్రభావన్ని చూపెడుతుంద’ని అన్నారు. 

అలాగే వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడిన మోదీ.. మహాత్ముని 150 జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2వ తేదీ నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను ప్రజలంతా నిషేధించాలి. 130 కోట్ల మంది భారతీయులు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వాడకాన్ని నిషేధిస్తూ ప్రతిజ్ఞ తీసుకోవడం దేశానికే కాకుండా, ప్రపంచానికే గర్వకారణం. దేశ ప్రజలంతా ఇందుకు సహకరిస్తారనే నమ్మకం తనకుంద’ని ధీమా వ్యక్తం చేశారు. 

దీపావళి రోజున కూతుళ్లను గౌరవిద్దాం..
పండుగ సందర్భంగా కుటుంబాల్లో ఎంతో సందండి నెలకొంటుంది.. ఇలాంటి సందర్భంలో పండుగ జరుపుకోలేని వారికి సాయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీపావళి రోజున లక్ష్మి దేవి ప్రతి ఒక్కరి ఇళ్లలోకి ఆనందాన్ని, సంపదను తీసుకురావాలని ఆకాంక్షించారు. మన ఇళ్లలోని కూతుళ్ల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మన కూతుళ్లు సాధించిన ఘనత ప్రపంచానికి తెలిసేలా.. వారి విజయాలను సోషల్‌ మీడియాలో #BHARATKILAXMI హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్‌ చేయాలని కోరారు. గతంలో ‘సెల్ఫీ విత్‌ డాటర్‌’ ఏ విధంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ దీపావళి రోజున కూతుళ్లను గౌరవిద్దామని మోదీ పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top