మోదీ హామీలపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌

Narendra Modi Progress Report - Sakshi

మెజారిటీ హామీలు పాక్షికమే

ధరల నియంత్రణ అంతంత మాత్రం

పట్టాలెక్కని బుల్లెట్‌ ట్రెయిన్‌

రైతులకు కొంత వరకు ఊరట

ప్రధాని నరేంద్ర మోదీ మరి కొన్ని రోజుల్లో న్యూఢిల్లీలోని ఎర్ర కోట బురుజుల నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. తన ప్రభుత్వ లక్ష్యాలను, చేపట్టే ప్రజోపయోగ కార్యక్రమాలను ఆ ప్రసంగంలో వివరిస్తారు.మోదీ ఇంత వరకు నాలుగు సార్లు స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగాలు చేశారు. వాటిల్లో ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. రానున్నది ఎన్నికల సంవత్సరం.తమ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన సంక్షేమ పథకాల ప్రోగ్రెస్‌ రిపోర్టును వచ్చే ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుంచుతామని, దాన్ని బట్టి ప్రజలు తమ సర్కారు పనితీరుకు మార్కులు వేస్తారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు గత నాలుగేళ్లుగా ఇచ్చిన హామీల పరిస్థితిపై ఫ్యాక్ట్‌ చెకర్‌ సంస్థ జరిపిన అధ్యయనం వివరాలిలా ఉన్నాయి:

    1. జీడీపీ: దేశ జీడీపీని గణనీయంగా పెంచుతామని మోదీ సర్కారు వాగ్దానం చేసింది. ఆ మేరకు 2012లో 5.5శాతం ఉన్న జీడీపీ 2015–16 నాటికి 7.9 శాతానికి పెరిగింది. అయితే, మళ్లీ 2016–17 కల్లా అది 7.1శాతానికి తగ్గింది.జీడీపీలో మన దేశం ప్రపంచ దేశాల జాబితాలో ఆరో స్థానంలో ఉంది.
    2. ద్రవ్యోల్బణం:  వినిమయ ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ వస్తోంది.2012–13లో 10.2% ఉండగా, 2015–16 నాటికి 4.9 శాతానికి తగ్గగా 2016–17లో 4.5 శాతానికి పడిపోయింది.ఇది మోదీ సర్కారు విజయమేనని చెప్పవచ్చు.
    3. సైనికులకు ఒకే ర్యాంకు–ఒకే పెన్షన్‌: ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. అయితే,కొన్ని సమస్యలు పరిష్కారం కావలసి ఉంది.2017,ఏప్రిల్‌ నాటికి 21 లక్షల మందికి ఏరియర్స్‌ కింద8,792 కోట్లు విడుదల చేసింది.ఇక ఆఖరి వాయిదా చెల్లించాల్సి ఉంది.
    4. సమర యోధులకు పెన్షన్‌ పెంపు : స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు ఇచ్చే పింఛనును 20% పెంచుతామన్న హామీని మోదీ సర్కారు నెరవేర్చింది.వీరికి పింఛనును 21% పెంచింది.అంటే 24వేల నుంచి 30 వేలు అయింది.
    5. పోస్టాఫీసులు పేమెంట్‌ బ్యాంకులుగామార్పు:2017 సెప్టెంబర్‌ నాటికి 650 పోస్టాఫీసులను పేమెంట్‌ బ్యాంకులుగా మార్చడం జరిగింది. మోదీ హామీ దాదాపుగా నెరవేరింది.
    6. గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం: ఈ హామీ మూడొంతులు నెరవేరింది. దేశ వ్యాప్తంగా విద్యుత్‌ లేని గ్రామాలు 18,452 ఉండగా, 2016–17 నాటికి 14,132 గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించడం జరిగింది.
    7. ఉద్యోగ కల్పన: ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ సర్కారు హామీ ఇచ్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇన్ని ఉద్యోగాల కల్పన జరగలేదు. అయితే, ముద్ర, స్టాండప్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా వంటి పథకాల ద్వారా 9 కోట్ల మందికి స్వయం ఉపాది కల్పించామని, ఇది కూడా ఉద్యోగ కల్పనేనని బీజేపీ అంటోంది.
    8. ధరల నియంత్రణ:నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, బ్లాక్‌ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరలేదు. ఇంత వరకు ఒక్క ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు కాలేదు. నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.
    9. బుల్లెట్‌ ట్రైన్‌లు: డైమండ్‌ క్వాడ్రిలేటరల్‌ ప్రాజెక్టు పేరుతో దేశంలో పలు మార్గాల్లో బులెట్‌ రైళ్లను ప్రవేశపెడతామన్న హామీ కాగితాలకే పరిమితమయింది.గత ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ముంబై–అహ్మదాబాద్‌ బులెట్‌ రైలు మార్గానికి శంకుస్థాపన జరిగింది కాని ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు.
    10. నల్లధనం రాక: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి భారతీయులందరికీ పంచుతామన్న హామీ ఇప్పటికీ హామీగానే మిగిలిపోయింది.
    11. మహిళలకు రిజర్వేషన్లు:రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మోదీ సర్కారు వాగ్దానం ఇంకా పెండింగులోనే ఉంది.
   12. రైతుల ఆదాయం పెంపు: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తులకు సాగు ఖర్చుకు కనీసం 50శాతం ఎక్కువ ధర కల్పిస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ చట్టాన్ని సవరిస్తామని ఎన్డీయే ప్రభుత్వం హామీ ఇచ్చింది.ఈ హామీలు పూర్తి స్థాయిలో నెరవేరలేదు. వ్యవసాయ మద్దతు ధరలు పెంచినప్పటికీ ఇంది ఖర్చుపైన 50శాతం స్థాయికి పెంచలేదు. మార్కెట్‌ కమిటీ చట్టం ఇంకా రూపుదాల్చలేదు.
    13. విద్యార్థినులకు మరుగుదొడ్లు: ఏడాదిలో దేశంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని 2014లో మోదీ ప్రభుత్వం పేర్కొంది.అయితే, దేశంలో11,70,902 పాఠశాలలు ఉండగా,2015–16 నాటికి 97.96 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది.
    14. లోక్‌పాల్‌: మోదీ సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇంత వరకు లోక్‌పాల్‌ నియామకం జరగలేదు.అలాగే, దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామన్న వాగ్దానం కూడా అమలు కాలేదు. కాశ్మీరీ పండిట్లను తిరిగి కశ్మీర్‌ రప్పిస్తామని, రాష్ట్రంలో సత్పరిపాలన అందిస్తామని,370వ అధికరణను రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను కూడా మోదీ సర్కారు నిలబెట్టుకోలేకపోయింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top