ఆనంద్‌ మహీంద్ర నుంచి ఊహించని గిఫ్ట్‌

Mysuru Man Takes Mother On Pilgrimage On Scooter - Sakshi

బెంగళూర్‌ : కన్నతల్లి తమకు భారమైందని వదిలించుకునే పిల్లలున్న కాలంలో మైసూరుకు చెందిన ఓ వ్యక్తి 70 సంవత్సరాల తల్లిని తన స్కూటర్‌పై 48,100 కిలోమీటర్ల మేర యాత్రకు తీసుకువెళ్లిన ఉదంతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. హంపిని చూడాలని ఉందని చెప్పడంతో ఇంటి బయట ఎప్పుడూ కాలుపెట్టని తన తల్లిని దేశవ్యాప్తంగా యాత్రా స్ధలాలకు తీసుకువెళ్లాలని కుమారుడు కృష్ణ కుమార్‌ నిర్ణయించుకున్నాడు. అనుకుందే తడవు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ తన 20 ఏళ్ల నాటి బజాజ్‌ స్కూటర్‌పై తల్లిని తీర్థయాత్రలకు తీసుకువెళ్లాడు. కన్నతల్లిపై కృష్ణ కుమార్‌కున్న ప్రేమను చాటే వీడియోను నాంది ఫౌండేషన్‌ సీఈవో మనోజ్‌ కుమార్‌ ట్వీట్టర్‌లో షేర్‌ చేయడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సహా పలువురు స్పందించారు.

మైసూరులో ఒంటరిగా ఉంటున్న తన తల్లి కోరికను నెరవేర్చేందుకు ఎంతదూరమైనా వెళ్లాలని తాను నిర్ణయించుకున్నానని ఈ వీడియోలో కృష్ణ కుమార్‌ పేర్కొన్నారు. ఒంటరిగా ఉంటున్న తన తల్లికి ఒక్కడే కుమారుడైన తనతో నాణ్యమైన సమయం గడిపే అర్హత ఉందని, అలాగే జీవితంలో ఆమె చేసిన త్యాగాలకు గౌరవప్రదమైన జీవితం గడపాల్సిన అవసరం ఉందని తనకు అనిపించిందని చెప్పుకొచ్చారు. వంటింటికే పరిమితమైన తల్లిని ఇప్పుడు దేశమంతటా తీర్ధయాత్రకు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ఏడు నెలల పాటు పలు రాష్ట్రాల్లో తల్లీ కొడుకుల యాత్ర సాగిందని ఒరిస్సా పోస్ట్‌ వివరించింది. భారత్‌లో వారిద్దరు పలు దర్శనీయ స్థలాలను చుట్టివచ్చారు. హోటల్‌ ఖర్చులను నివారించేందుకు వారు మఠాలు, సత్రాల్లో బసచేసేవారని, ఆహార పద్దార్థాలను స్కూటర్‌లో నిల్వ చేసుకునేవారని ఒరిస్సా పోస్ట్‌ తెలిపింది. అందరి హృదయాలను స్పృశించిన ఈ కథ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రను కదిలించింది. తల్లిపై, దేశంపై కృష్ణకుమార్‌కున్న ప్రేమ నిరుపమానమని, ఆయన తనకు తారసపడితే తనకు మహీంద్ర కేయూవీ 100 నెక్ట్స్‌ను బహుకరిస్తానని, తన తదుపరి యాత్రకు తన తల్లిని ఈ వాహనంపై కృష్ణకుమార్‌ తీసుకువెళ్లవచ్చని మహీంద్ర ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top