వేడిని పెంచుతున్న ఫుట్‌పాత్‌లు

Minimise Pavements To Curb Sweltering Nights - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుందర నగరాల్లో సాధారణంగా రోడ్ల పక్కన ఎండ ఎక్కువ పడకుండా ఎల్తైన చెట్లు, పక్కన పాదాచారుల కోసం సిమ్మెంట్‌ టైల్స్‌తో కూడిన ఫుట్‌పాత్‌లు కనిపిస్తాయి. పగటి పూట ఎండ వేడిని తగ్గించేందుకు రోడ్లు పక్కనున్న ఎల్తైన చెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. సిమ్మెంట్‌ ఫుట్‌పాత్‌లు, పక్కనుండే పలు అంతస్తుల భవనాలు పగటి పూట ఎండలోని వేడిని గ్రహించి రాత్రి పూట వాతావరణంలోకి వదులుతాయి. తద్వారా రాత్రిపూట వాతావరణం ఆశించినంత లేదా కావాల్సినంత చల్లగా ఉండక పోవచ్చు. మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట వాతావరణం చల్లగా ఉండాలనేది వైద్యులు ఎప్పుడే తేల్చి చెప్పారు. అయితే సిమ్మెంట్‌ ఫుట్‌పాత్‌లు, ఎల్తైన కాంక్రీటు భవనాలు రాత్రి పూట వాతావరణం వేడికి కారణం అవుతున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పుడు కనిపెట్టారు.

మాడిసన్‌లోని విస్కాన్సిన్‌ యూనివర్శిటీ పరిశోధకులు సైకిల్‌ మోటర్లకు జీపీఎస్‌ డివైస్‌లు, ఉష్ణోగ్రత సెన్సర్లు అమర్చి పగటి పూట, రాత్రివేళ వివిధ రోడ్లలో వాటిని నడిపి ఉష్ణోగ్రతలను నమోదు చేశారు. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల్లో ఉన్నాయో గమనించి ఎందుకున్నాయో తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిసరాలను పరిశీలించారు. కింద కాంక్రీట్‌ ఫుట్‌పాతులున్నా, పైన ఛత్రిలాగా గుబురైన చెట్లు ఉన్న చోట వేడి తక్కువగా ఉండడం, పక్కన ఎల్తైన కాంక్రీటు భవనాలుంటే వేడి స్థాయిలో మార్పులు ఉండడం గమనించారు. పార్కుల వద్ద ఎక్కువ చెట్లు ఉండడం వల్ల అక్కడి వాతావరణం ఎక్కువగా చల్లగా ఉండడం తెల్సిందే. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇతర వేడి ప్రాంతాలకు పనులపై తరచూ వెళ్లి రావడం వల్ల కూడా (చలి, వాతావరణంల మధ్య సర్దుబాటు కుదరక) వారి ఆరోగ్యం దెబ్బతింటుందట.

పల్లెల్లో అంతగా చెట్లు లేకున్నా పట్టణాల్లో ఎక్కువ చెట్లున్నా పట్టణాల్లో వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండడానికి కారణం (వాహనాల కాలుష్యాన్ని మినహాయించి) వేడిని గ్రహించి రాత్రికి దాన్ని వదిలేసే కాంక్రీట్‌ భవనాలే. అందుకని కాంక్రీటు భవనాల మధ్య చెట్లు ఉండడంతోపాటు కాంక్రీట్‌ ఫుట్‌పాత్‌లకు బదులు, గడ్డితో కూడిన ఫుట్‌పాత్‌లు ఉండడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. చెట్లు పార్కులకే పరిమితం కాకుండా ప్రతివీధి, ప్రతి సంధులో చెట్లు ఉండడం వల్ల వాతావరణం చల్లగా ఉండడంతోపాటు సమ ఉష్ణోగ్రత ఉండి ప్రజల ఆరోగ్యానికి ఢోకా ఉండదని వారంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top