హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ వనీ హతం

Militant Manan Wani Killed in Kupwara - Sakshi

మరో ఉగ్రవాది కూడా..

కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్‌

విచారం వ్యక్తంచేసిన హురియత్‌ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్‌: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు కశ్మీర్‌ లోయలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ సంస్థ టాప్‌ కమాండర్‌ మనాన్‌ బషీర్‌ వనీతో పాటు అతని అనుచరుడు హతమయ్యారు. 27 ఏళ్ల వనీ పీహెచ్‌డీని మధ్యలో మానేసి మిలిటెన్సీ బాటపట్టాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మరో ఉగ్రవాదిని ఆషిక్‌ హుస్సేన్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదులకు గౌరవసూచకంగా శుక్రవారం బంద్‌ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు.

లొంగిపొమ్మన్నా వినలేదు..
హంద్వారాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు వెళ్లి అక్కడ గురువారం వేకువజాము నుంచే సోదాలు నిర్వహించాయి. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు తొలుత భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారని, దీనికి స్పందించిన భద్రతా దళాలు కూడా కాల్పులకు దిగినట్లు ఓ అధికారి తెలిపారు. ఇలా ఇరు పక్షాల మధ్య ఉదయం 11 గంటల వరకు కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. మిలిటెంట్లు లొంగిపోవాలని పోలీసులు పలుమార్లు మైకు ద్వారా ప్రకటించినా ఎలాంటి ప్రయోజనంలేకపోయిందని అన్నారు. ఎన్‌కౌంటర్‌ ముగిశాక ఆ ఇంటి నుంచి వనీ, హుస్సేన్‌ల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు.  

అంత్యక్రియలకు 10వేల మంది: లోలాబ్‌ ప్రాంతంలోని టేకిపురా సమీపంలో ఉన్న వనీ స్వగ్రామంలో జరిగిన అతని అంత్యక్రియలకు సుమారు 10 వేల మంది హాజరయ్యారు. మరోవైపు, బషీర్‌ వనీ మరణవార్త తెలియగానే శ్రీనగర్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వారు. శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా ఉత్తరకశ్మీర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలను అధికారులు మూసేశారు. పుకార్లు, విద్వేష ప్రసంగాలు వ్యాపించకుండా ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ బంద్‌ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. స్వీయపాలన కోసం పోరాడుతున్న ఓ భావి మేధావిని కోల్పోయామని మితవాద హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ చెప్పారు. వనీ ఎన్‌కౌంటర్‌పై జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా విచారం వ్యక్తం చేశారు.

పీహెచ్‌డీ వద్దని మిలిటెన్సీలోకి
2016లో బుర్హాన్‌ వనీ హతమైన తరువాత మిలిటెన్సీ వైపు ఆకర్షితులైన విద్యావంతుల్లో బషీర్‌ వనీ ఒకడు. ముందునుంచి చదువుల్లో చురుకుగా ఉన్న బషీర్‌ వనీ ప్రతిష్టాత్మక సైనిక్‌ స్కూల్లో 11, 12వ తరగతులు పూర్తిచేశాడు. మెరిట్‌ విద్యార్థిగా పాఠశాల, కళాశాల రోజుల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఎన్‌సీసీ క్యాడెట్‌గా పంద్రాగస్టు, రిపబ్లిక్‌ డే కవాతుల్లో కూడా పాల్గొన్నాడు. 2010, 2016లో కశ్మీర్‌ లోయలో చెలరేగిన తీవ్ర నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వాడు, అలీగఢ్‌ యూనిర్సిటీలో పీహెచ్‌డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు. ఈ ఏడాది జనవరి 3న అలీగఢ్‌ వర్సిటీని వదిలి వెళ్లాడు. అతని పేరు ఇప్పటికీ వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. భూగర్భశాస్త్రంలో పీహెచ్‌డీ చదువుతున్న వనీకి భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్‌ పేపర్‌ ప్రజెంటేషన్‌’ అవార్డు కూడా దక్కింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top