
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ : నాగపూర్ వేదికగా ఆరెస్సెస్ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాన్ని కాంగ్రెస్ నేతలు ప్రశంసిస్తున్నా ఆయన ఆ కార్యక్రమానికి వెళ్లడంపై పలువురు నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రణబ్ హాజరుకావడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ తప్పుపట్టారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాలనికి వెళ్లి జాతీయవాదంపై ప్రసంగం ఎందుకు ఇవ్వదలుచుకున్నారన్న తమ ప్రశ్నకు మీరు ఇంతవరకూ సమాధానం ఇవ్వకపోవడం లక్షలాది లౌకికవాదులను ఆందోళనకు గురిచేస్తున్నదని తివారీ పేర్కొన్నారు.
ఆరెస్సెస్ కార్యకలాపాలను నిరసిస్తూ గతంలో తమకు శిక్షణ ఇచ్చిన పాతతరం కాంగ్రెస్ నేతగా ప్రణబ్ ఆ కార్యక్రమానికి ఎందుకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు. గతంలో దెయ్యంలా కనిపించిన ఆరెస్సెస్ ఇప్పుడు ధర్మసంస్థలా మారిందా అని ప్రణబ్‌ను ఆయన ప్రశ్నించారు.
కాగా ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఆరెస్సెస్ వేదికగా ప్రణబ్ కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి వివరించారని, ఆరెస్సెస్ భావజాలం తప్పని పరోక్షంగా సూచించారని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం ట్వీట్ చేశారు. పార్టీ నేతలు ఆనంద్ శర్మ, రణదీప్ సుర్జీవాలాలు సైతం ప్రణబ్ ప్రసంగాన్ని స్వాగతించారు.