సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందు మూడు డిమాండ్లు పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఢిల్లీ: సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందు మూడు డిమాండ్లు పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. వాటిని పరిగణనలోకి తీసుకుంటేనే తాను పార్టీలో ఉంటానంటూ కూడా కేజ్రీవాల్‌కు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విశ్వాస్.. ఆ మాటలు మాట్లాడించింది ఎవరో తనకు తెలుసంటూ పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వాన్నే టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల ప్రోద్బలంతోనే కుమార్ విశ్వాస్ వ్యవహరిస్తున్నారని ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే.
తనగురించి అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలు అందరూ చూశారని.. అలాంటి వ్యాఖ్యలే అరవింద్ కేజ్రీవాల్ మీద గానీ, మనీష్ సిసోదియా మీద గానీ చేసి ఉంటే పది నిమిషాల్లో అతడిని పార్టీ నుంచి బయటకు పంపేసేవారని, కానీ తన గురించి ఎన్నిసార్లు అతడు ఏం మాట్లాడినా పార్టీ నుంచి తొలగించలేదు సరికదా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమార్ విశ్వాస్ మండిపడ్డారు. దీంతో విశ్వాస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు బయలుదేరాయి. దీంతో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన విశ్వాస్ వెళ్లిపోతే పార్టీకి తీరని దెబ్బవుతుందని గ్రహించిన కేజ్రీవాల్ బుధవారం సమావేశం ఏర్పాటుచేసి ఆయన అసంతృప్తిని తెలుసుకున్నారు. దీంతో కుమార్ విశ్వాస్ మూడు షరతులు పెట్టినట్లు సమాచారం. అవేమిటంటే..
1. అవినీతి, జాతీయవాదంపై ఎలాంటి రాజీ పడొద్దు.
2.పార్టీ కార్యకర్తలో నిత్యం కమ్యునికేషన్‌లో ఉండాలి.. వారి తరుపు వాదనలు కూడా వినాలి.
3.అమనతుల్లా ఖాన్ తొలగింపు అంశంపై తప్పకుండా చర్చ జరగాలి.