కేంద్రం సజ్జాద్‌ను సీఎం చేయాలనుకుంది: సత్యపాల్‌

Kashmir Governor Crucial Comments On Dissolving Assembly - Sakshi

చరిత్ర హీనుడిగా మిగలడం ఇష్టంలేకే అసెంబ్లీ రద్దు : సత్యపాల్‌ మాలిక్‌

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తాజా వ్యాఖ్యలు కేంద్రంలోని బీజేపీ సర్కారును ఇరకాటంలో పడేశాయి. అసెంబ్లీని తాను రద్దు చేయకుంటే కేంద్రం ఒత్తిడి కారణంగా జేకేపీసీ (జమ్మూ కశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌) పార్టీ అధినేత సజ్జాద్‌లోన్‌తో తాను సీఎంగా ప్రమాణం చేయించాల్సి వచ్చేదని సత్యపాల్‌ అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నిజాయితీ లేని వ్యక్తిగా మిగిలిపోవడం ఇష్టం లేకనే తాను అసెంబ్లీని రద్దు చేశానని పేర్కొన్నారు. ‘ఇప్పుడు ఆ సమస్య మొత్తం ముగిసింది. ఎవరేమనుకున్నా, నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని నా మనస్సు చెబుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

గవర్నర్‌ పాలనలో ఉన్న కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ), కాంగ్రెస్‌ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్‌ను పీడీపీ కోరడం, తర్వాత కొన్ని గంటల్లోనే బీజేపీ మద్దతుతో తామూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జేకేపీసీ సంప్రదించడంతో గవర్నర్‌ సత్యపాల్‌ అసెంబ్లీనే రద్దు చేసిన విషయం తెలిసిందే. కేం‍ద్రం ఆదేశాల మేరకే గవర్నర్‌ ఇలా చేశారని కాంగ్రెస్‌ ఆరోపించగా.. ఎన్‌సీ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ చీఫ్- మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మాత్రం భిన్నంగా స్పందించారు.

శాసనసభను రద్దు చేయకుండా సమావేశపరిచి గవర్నర్‌ బలపరీక్ష నిర్వహించి ఉంటే ఎవరి బలం ఎంతో తేలేదని ఫరూక్‌ అబ్దుల్లా అభిప్రాయపడగా... ‘ఫ్యాక్స్‌ యంత్రాన్ని పట్టించుకోకుండా, కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేసి అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్‌ నిర్ణయం జమ్మూ కశ్మీర్‌కు నిజంగా గొప్పది’ అని ముఫ్తీ ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top