‘తన శేష జీవితాన్ని దేశ సేవలో గడుపుతానన్నాడు’

Judge Writes Nathuram Godse Was Nervous While Death Sentence - Sakshi

న్యూఢిల్లీ : నేటితో దేశ వాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అంటూ మక్కల్‌ నీది మయ్యం అధినేత, సినీ నటుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీని హత్యచేసిన గాడ్సే దేశ భక్తుడిగా భోపాల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ అభివర్ణించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి నాథూరామ్‌ గాడ్సే రెండు జాతీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రంగా మారారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగింది. సాధ్వి వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సహా ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. బాపును  అవమానించిన ప్రజ్ఞాను ఎంతమాత్రం సహించబోమంటూ ప్రధాని మోదీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

అయితే గాడ్సే దేశ భక్తుడిగా కీర్తిపంబడటం ఇదే తొలిసారి కాదని.. ఆయనను ప్రశంసించిన ప్రజ్ఞాపై విరుచుకుపడుతున్న బీజేపీ శ్రేణులు 1990లో జరిగిన విషయాన్ని మరచిపోయాయేమోనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1990లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ- శివసేన కూటమి ప్రభుత్వ హయాంలో గాంధీని చంపడానికి గల కారణాలను విశ్లేషిస్తూ.. గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణిస్తూ ఒక నాటకం ప్రదర్శితమైంది. దీంతో కేవలం ప్రజ్ఞాపై చర్యలు తీసుకున్నంత మాత్రాన గాడ్సేపై బీజేపీ స్టాండ్‌ మారినట్టు కాదని కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో గాడ్సే గురించి జస్టిస్‌ జేడీ ఘోస్లా 1965లో రాసిన పుస్తకంలోని కొన్ని ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ట్రయల్‌ కోర్టు విధించిన ఉరిశిక్షను సవాలు చేస్తూ గాంధీ హత్యోదంత నిందితులు ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ విచారించిన వారిలో ఘోస్లా కూడా ఒకరు. ఈ క్రమంలో మహాత్మా గాంధీ హత్యకు నాథూరామ్‌ గాడ్సే, అతడి స్నేహితులు కుట్ర పన్నిన విధానం, ఉరికంబం ఎక్కేముందు గాడ్సే మానసిక పరిస్థితి గురించి జేడీ ఘోస్లా వెల్లడించిన వివరాలు సంక్షిప్తంగా...

రెండు ఇన్యూరెన్సు పాలసీలు..
భారత దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌కు చెల్లించాల్సిన 55 కోట్ల రూపాయల విషయంలో ప్రభుత్వ జాప్యం తగదని, ఈ విషయంపై మరోసారి సమీక్ష జరపాలంటూ మహాత్మా గాంధీ నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో జనవరి 13నే ఆయన హత్యకు బీజం పడింది. ఇది పక్కా పథకం ప్రకారమే జరిగింది. నిజానికి జనవరి 30 కంటే పది రోజుల ముందే గాడ్సే, అతడి స్నేహితులు గాంధీని చంపాలనుకుని విఫలమయ్యారు. తన మరణం ఖాయమని భావించిన గాడ్సే తన పేరిట 2 వేలు, 3 వేల విలువ చేసే ఇన్యూరెన్స్‌ పాలసీలకు అత్యవసరంగా నామినీలను ప్రతిపాదించారు. రూ. 2 వేల పాలసీకి స్నేహితుడు నారాయణ ఆప్టే భార్యను నామినీగా పేర్కొంటూ జనవరి 13న గాడ్సే పత్రాలు సిద్ధం చేయించాడు. మరొక పాలసీ డబ్బులు తన సోదరుడి భార్యకు చెందేలా ఏర్పాట్లు చేశాడు. అనంతరం తమ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. జనవరి 30న గాంధీజీ రాక కోసం ఢిల్లీలోని బిర్లా మందిర్‌ ప్రాంగణంలో సుమారు 200 మంది ఎదురు చూస్తున్నారు. వారిలో గాడ్సే కూడా కలిసిపోయాడు. కాసేపటి తర్వాత ఇద్దరు బాలికల సహాయంతో గాంధీజీ అక్కడకు చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేసే సమయంలో వేగంగా ముందుకు కదిలిన గాడ్సే... గాంధీజీకి కుడి పక్కన ఉన్న అమ్మాయిని బలంగా నెట్టివేసి ఆయన ముందు నిలబడ్డాడు. వెంటనే పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి మూడుసార్లు కాల్పులు జరిపాడు.

గాడ్సే ముఖంలో భయం..
ఈ పరిణామం తర్వాత అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా గాడ్సేపై దాడి చేశారు. అయితే పోలీసులు రావడంతో అతడు వారి నుంచి తప్పించుకున్నాడు. గాడ్సేను అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ హత్యలో అతడికి సహకరించిన నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత జడ్జి ఆత్మ చరన్‌ నేతృత్వంలో ట్రయల్‌ ప్రారంభమైంది. 1949, ఫిబ్రవరి 10న కోర్టు తన తీర్పు వెలువరించింది. హిందూ మహాసభ నాయకుడు వీర్‌ సావర్కర్‌(బీజేపీ ప్రముఖంగా ప్రస్తుతించే వ్యక్తి)కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని తేల్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా ఆయన బయటపడ్డారు. అనంతరం నాథూరామ్‌ గాడ్సే, అతడి స్నేహితుడు నారాయణ ఆప్టేలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో నిందితులు పంజాబ్‌ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ముగ్గురు న్యాయవాదులతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది(జస్టిస్‌ ఘోస్లా ఇందులో సభ్యులు). ఇక్కడ కూడా గాడ్సే, ఆప్టేలకు ఉరిశిక్ష విధించాలనే కోర్టు తీర్పునిచ్చింది. దీని ప్రకారం1949, నవంబరు 15న వారిద్దరిని అంబాలా జైలులో ఉరితీశారు.

అయితే శిక్ష అమలు కావడానికి ముందు బతికేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా గాడ్సే కోరాడు. శాంతి గురించి ప్రచారం చేసుకుంటూ దేశ సేవలో తన శేష జీవితాన్ని గడుపుతానని పేర్కొన్నాడు. కానీ గాడ్సేకు ఆ అవకాశం లభించలేదు. ఉరిశిక్ష అమలయ్యే రోజున ఆ ఇద్దరు ఖైదీల చేతలు వెనక్కి మడిచి అధికారులు ఉరికంబం దగ్గరికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తడబడుతూనే గాడ్సే ముందుకు నడిచాడు. విషణ్ణ వదనంతో, భయంతో ఆయన ముఖకవళికల్లో పూర్తి మార్పు కనిపించింది. ఉరికంబం ముందు నిల్చుని గాడ్సే మానసిక యుద్ధం చేశారు. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించారు. ఉరి తీయడానికి కొన్ని క్షణాల ముందు అఖండ భారత్‌ అంటూ నినదించిన గాడ్సే గొంతు జీరబోయింది. ట్రయల్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ వాదించినప్పుడు ఉన్నంత ధైర్యం ఇప్పుడు ఆ గొంతులో ప్రతిధ్వనించలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top