మంచుకొండల్లోన..

Indian Army Plans To Open Siachen Glacier For Civilians - Sakshi

ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధభూమి.. సియాచిన్‌ను ఇక మీరూ చూడొచ్చు.. మన వీరజవాన్ల కష్టాలు తెలుసుకోవచ్చు..  దీనికి తగిన ఏర్పాట్లు చేసేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది. సాధారణ పౌరులు అక్కడికి వెళ్లేలోపు.. ఆ ప్రాంత విశేషాలు కొన్ని..

  • సియాచిన్‌ భారత్‌ అధీనంలో ఉన్నంత వరకు పాకిస్తాన్, చైనా నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం సాధ్యం కాదు. తద్వారా లదాక్‌పై మన పొరుగు దేశాల దృష్టిపడదు. చైనా అధీనంలోని షక్స్‌గామ్‌ లోయ, పాక్‌ అధీనంలోని బాల్టిస్తాన్‌కు మధ్యలో ఉంటుంది సియాచిన్‌. ఇది భారత్‌కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం.
  • సియాచిన్‌ హిమానీనదీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు భారత్‌ రోజుకు రూ.5 నుంచి రూ.7 కోట్లు ఖర్చు చేస్తోంది. 3 వేల మంది జవాన్లు ఇక్కడి సరిహద్దులను కాపలా కాస్తుంటారు.
  • 1984లో ఈ ప్రాంతాన్ని మన 
  • స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచి సియాచిన్‌లో సుమారు వెయ్యి మంది సైనికులు మరణించారు. వీరిలో పాక్‌ కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య సుమారు 220 కాగా.. మిగిలిన వారు అననుకూల వాతావరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్‌ యుద్ధంలో మరణించిన వారి కంటే ఈ సంఖ్య రెట్టింపు.
  • సముద్రమట్టానికి 21 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌ ఆర్మీ పోస్టుల్లో సాధారణంగా ఒక జవాన్‌ 3 నెలలు మాత్రమే పనిచేస్తారు. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సుమారు 28 రోజుల పాటు మంచు గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది. మొత్తం 128 కిలోమీటర్ల దూరం నడిస్తేగానీ.. సియాచిన్‌ ఆర్మీ పోస్టులకు చేరుకోలేం.
  • సియాచిన్‌లోని సాల్‌టోరో వద్ద పాక్‌ ఆర్మీ పోస్టులు సుమారు 3వేల అడుగుల దిగువన ఉంటాయి. సియాచిన్‌లో మిలిటరీ దళాల ఉపసంహరణ కోసం భారత్‌–పాక్‌ మధ్య చర్చలు జరిగాయి.
  • ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌ ద్వారా 1984లో సియాచిన్‌లో భారత్‌.. పాక్‌పై తొలిసారి దాడి చేసింది. 2003లో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
  • సియాచిన్‌ హిమానీనదిని సాధారణ పౌరులు సందర్శించడం దాదాపు అసాధ్యం. ఏటా మిలిటరీ అధికారులు ఒక యాత్ర నిర్వహిస్తారు. సుమారు 40 మందితో కూడిన బృందంతో ఈ సాహసయాత్ర నడుస్తుంటుంది. ఇందులో ఆర్మీ నిపుణులతో పాటు ఇద్దరు విలేకరులు, రక్షణ రంగ శాస్త్రవేత్తలు, స్కూల్‌ విద్యార్థులు, స్వచ్ఛందంగా ముందుకొచ్చే పౌరులు భాగస్వాములుగా ఉంటారు.
  • జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌ ప్రాంతం నుంచి సియాచిన్‌ యాత్ర మొదలవుతుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తొలి రెండ్రోజులు కేవలం కడుపునిండా తినడం.. కంటి నిండా నిద్రపోవడంతో గడచిపోతుంది. వాతావరణ పరిస్థితులకు శరీరం అలవాటు పడేందుకు ఈ ఏర్పాటు.
  • విస్తృత వైద్య పరీక్షల తర్వాతే సియాచిన్‌ యాత్ర ప్రయాణికుల తుది జాబితా సిద్ధమవుతుంది. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు నుబ్రా నది సమీపంలోని మిలటరీ స్కూల్‌లో తగిన శిక్షణ ఇస్తారు.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top