
వేగంగా దూసుకెళ్లే తొలి దేశవాళీ శతఘ్ని సిద్ధం
అహ్మద్‌నగర్: వేగంగా దూసుకెళ్తూ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ గురిచూసి లక్ష్యాలను ఛేదించే అధునాతన శతఘ్ని విభాగంలో భారత్ మరో ఘనత సాధించింది. తొలిసారిగా గరిష్టస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో దేశవాళీ శతఘ్ని (మౌంటెడ్ గన్ సిస్టమ్–ఎంజీఎస్)ని తయారు చేసినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రకటించింది.
తద్వారా శతఘ్నుల్ని వేగంగా మోహరించే అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆరి్టలరీ గన్ సిస్టమ్(ఏటీఏజీఎస్)లో భారత్ మరో ముందడుగువేసింది. త్వరలో ఈ ఎంజీఎస్‌ను పూర్తిస్థాయి పరీక్షల కోసం భారత సై న్యానికి అప్పగించనున్నారు. దీర్ఘకాలంపాటు కొనసాగే ఈ పరీక్షల్లో ఎంజీఎస్ తన సత్తాను చాటితే ఆ తర్వాత దీనిని సైన్యంలో విలీనం చేస్తారు. బాలాసోర్, పోఖ్రాన్‌లో దీనిని విజయవంతంగా పరీక్షించి చూశా మని వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (వీఆర్‌డీఈ) చీఫ్ జి.రామమోహనరావు చెప్పారు.

ఎన్నెన్నో ప్రత్యేకతలు
⇒ 155ఎంఎం/52 కాలిబర్ మందుగుండును పేల్చే సామర్థ్యంతో ఈ అధునాతన శతఘ్నిని రూపొందించారు. డీఆర్‌డీవోకు చెందిన అహ్మద్‌నగర్‌లోని వీఆర్‌డీ దీనిని తయారు చేసింది.
⇒ 85 సెకన్ల వ్యవధిలోనే వేగంగా విచ్చుకుని మందుగుండును లోడ్ చేసుకోగలదు. ఒక నిమిషంలో ఆరుసార్లు బాంబులను ప్రయోగించగలదు.
⇒ మందుగుండును ప్రయోగించగానే తన జాడ శత్రువులకు తెలీకుండా ఉండేందుకు వేగంగా ముడుచుకుని వేరే చోటుకు ప్రయాణం సాగించగలదు. ఒక చోట ఉండి భిన్న దిశలో బాంబులను ప్రయోగించగలదు.
⇒ ఇందులోంచి మందుగుండును పేల్చే గన్ బరువే ఏకంగా 30 టన్నులు.
⇒ గరిష్టంగా 45 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం తుత్తునియలు చేయగలదు. దీని క్యాబిన్‌ను పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కవచంతో నిర్మించారు. ఇందులో ఒకేసారి ఏడుగురు సైనికులు ప్రయాణించవచ్చు.
⇒ ఈ శతఘ్నిలో దాదాపు 85 శాతం పరికరాలు భారత్‌లో తయారైనవే.
⇒ దిగ్గజ ఫ్రాన్స్ సీజర్, ఇజ్రాయెల్ అ ట్మోస్ 2000 సిస్టమ్‌ల తరహాలో ఈ శ తఘ్నిని రూపొందించారు. ఒక్కో యూనిట్ ధర తో పోలిస్తే దీని తయారీ ఖర్చు తక్కువ.