నీటిచుక్క విలువెంతో తెలుసా?

India in top for usage of ground water - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నీళ్ల పొదుపు గురించి ఎవరెన్ని హెచ్చరికలు చేసినా నీళ్లకేమీ కొదవలే! అనుకుంటాం. అంతగా దాని గురించి ఆలోచించం. కానీ వాస్తవాలు తెలుసుకుంటే ఆలోచించక మానం. భారత్‌ ఏటా 251 క్యూబిక్‌ కిలోమీటర్‌ భూ జలాలను తోడేస్తోంది. మన తర్వాత చైనా, అమెరికా దేశాలు ఎక్కువ తోడేస్తున్నాయి. అయితే ఆ రెండు దేశాలు తోడుతున్న మొత్తానికన్నా మనమే ఎక్కువ నీళ్లను తోడేస్తున్నాం.

ప్రస్తుతం మన దేశంలో భూగర్భ జలాలు 60 శాతం సాగునీటి అవసరాలను, 85 శాతం గ్రామీణ తాగునీటి అవసరాలను, 50 శాతం పట్టణ తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి. అధిక వినియోగం, కలుషితం అవడం వల్ల నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతోంది. కేంద్ర భూగర్భ జలాల బోర్డు తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద 6,584 ప్రాంతాలను నీరు లభ్యత ప్రాంతాలుగా అంచనా వేయగా, వాటిలో ఇప్పటికే 1,034 ప్రాంతాల్లో నీటిని అధికంగా తోడేశాం. ఇలా నీరును అధికంగా తోడేసిన ప్రాంతాలను డార్క్‌ జోన్‌గా వ్యవహరిస్తారు.

రాష్ట్రాల వారిగా చూస్తే తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో డార్క్‌ జోన్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే, ఆయా రాష్ట్రాల్లో నీటిని అధికంగా తోడేశారన్న మాట. తమిళనాడులో నీరు లభ్యత ప్రాంతాలు 1139కి గాను 358 ప్రాంతాల్లో అధికంగా నీటిని తోడేశారు. పంజాబ్‌లో 138 ప్రాంతాలకు, 105 ప్రాంతాల్లో, అంటే 76 శాతం నీటిని అధికంగా తోడేశారు. రాజస్థాన్‌లో 248 ప్రాంతాలకుగాను 164 ప్రాంతాల్లో (66 శాతం) అధిక నీటిని తోడేశారు. ఢిల్లీలో 27 వాటర్‌ జోన్లకుగాను 15 జోన్లలో (56శాతం) అధిక నీటిని తోడేశారు.

నీటి లభ్యత జోన్లలో 30 శాతం హరించుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భాగర్భ జలాలను పెంచేందుకు అటల్‌ భూజల్‌ యోజన పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దానికి ఆరువేల కోట్ల రూపాయలను కేటాయించాలని నిర్ణయించింది. ఇందులో సగం మొత్తాన్ని బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా సమకూరుస్తుంటే మిగతా సగాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుతీసుకోవాలని నిర్ణయించింది. దీన్నిబట్టి నీటి చుక్క విలువెంతో తెలుసుకోవచ్చు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top