నేపాల్‌ది ఏకపక్ష చర్య.. అంగీకరించం: భారత్‌

India Says Wont Accept Nepal Unilateral Act And Artificial Enlargement - Sakshi

న్యూఢిల్లీ: లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్‌ చేస్తూ.. అందుకు సంబంధించిన తీర్మానాన్ని నేపాల్‌ అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ భూభాగాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. కాగా నేపాల్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్‌.. ఆ దేశం నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. నేపాల్‌ రూపొందించిన మ్యాప్‌కు చారిత్రక ఆధారాలు లేవని.. కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులు చెల్లవని తేల్చిచెప్పింది. (కాలాపానీ మాదే.. భారత్‌ నుంచి తీసుకుంటాం)

ఈ విషయం గురించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. నేపాల్‌ ప్రభుత్వ ఏకపక్ష చర్యను అంగీకరించబోమన్నారు. ‘‘ఈ విషయంలో భారత్‌ వైఖరి ఏమిటో నేపాల్‌కు స్సష్టమైన అవగాహన ఉంది. ఇకనైనా ఇలాంటి అన్యాయపూరితమైన పటాలు విడుదల చేయడం ఆపేయాలని నేపాల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కోరుతున్నాం. నేపాలీ అధినాయకత్వం సానుకూల వాతావరణంలో ద్వైపాక్షిక చర్చల ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.(భారత్‌పై నేపాల్‌ ప్రధాని షాకింగ్‌ కామెంట్లు!)

కాగా మే 11న భారత రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరాఖండ్‌ మీదుగా లిపులేఖ్‌ వరకూ మానస సరోవర్‌ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం నిర్మించిన రహదారికి శంకుస్థాపన చేసిన నాటి నుంచి నేపాల్‌ భారత్‌పై అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్‌.. భారత రాయబారికి నోటీసులు పంపడం సహా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత రాజముద్రలో ఉండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని ఉంటుందని, ఆ దేశం దానికి కట్టుబడి ఉంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (నేపాల్‌ కన్నెర్ర)

200 ఏళ్ల నాటి వివాదం
భారత్‌-నేపాల్‌-చైనా సరిహద్దులో గల లిపులేఖ్‌ భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది. ఈ సరిహద్దు వివాదం 200 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇరు దేశాల మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్‌ పాలకులు భారత్‌ తరఫున సంతకాలు చేయగా... ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా నేపాల్‌ కొత్త మ్యాపులు విడుదల చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top