కాలాపానీ మాదే.. భారత్‌ నుంచి తీసుకుంటాం

KP Sharma Oli Speaks About Kalapani And Lipulekh - Sakshi

కఠ్మాండు: లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్‌ నుంచి తిరిగి పొందుతామని నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్‌ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్‌ ఆమోదం తెలిపిన అనంతరం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ‘నేపాల్‌కు చెందిన ఈ మూడు ప్రాంతాల్లోనూ సైన్యాన్ని మోహరించి భారత్‌ వివాదాస్పదంగా మార్చింది. నేపాలీలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంది. కాలాపానీలో 1962 నుంచి భారత సైన్యం ఉంది. గత పాలకులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వెనుకంజ వేశారు. వాటిని మేం తిరిగి పొందుతాం’అని తెలిపారు. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్‌ చేస్తూ అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ పార్లమెంట్‌లో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్‌లోని ధర్చులా ప్రాంతాన్ని లిపులేఖ్‌ కనుమతో కలుపుతూ భారత్‌ రోడ్డు నిర్మించడంపై గత వారం నేపాల్‌లో భారత రాయబారికి నిరసన తెలిపింది. కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌ మ్యాప్‌ విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. చర్చల ద్వారా ఇరుదేశాలు దీన్ని పరిష్కరించుకోవాలని చైనా పేర్కొంది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top