పేదరికం తగ్గుతోంది..!

India Get Out Of Poverty By 2030 Says World Poverty Clock Report - Sakshi

2030 కల్లా భారత్‌లో దారిద్య్రయం కనుమరుగు

వరల్డ్‌ పావర్టీ క్లాక్‌ నివేదిక 

భారత్‌కు ఓ శుభవార్త.  అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశంగా భారత్‌∙పేరిట ఉన్న రికార్డ్‌ను  తాజాగా నైజీరియా  అధిగమించింది. అంతేకాదు... మనదేశంలో ప్రతీ నిమిషానికి 44 మంది దుర్భర దారిద్య్రం నుంచి బయటపడుతున్నారు. అదే నైజీరియాలో నిమిషానికి ఆరుగురు పేదలు పెరుగుతున్నారు. ‘ ఈ ఏడాది మే చివరకల్లా నైజీరియాలో 8.7 కోట్ల మంది కడు పేదరికంలో మగ్గుతున్నారు. అదే భారత్‌లో 7.3 కోట్ల మంది పేదలున్నారు. నైజీరియాలో దారిద్య్రం పెరుగుతుండగా, భారత్‌లో తగ్గుతోంది’ అని  వరల్డ్‌ పావర్టీ క్లాక్‌ నివేదిక స్పష్టం చేసింది. రోజుకు రూ.130.25  (1.9 డాలర్లు) కంటే తక్కువలో జీవనాన్ని సాగిస్తుంటే అది దుర్భర దారిద్య్రం కిందకు వస్తుందని ఖరారు చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 188 దేశాల్లో దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్న ప్రజలు. వారి జీవితాలతో ముడిపడిన అంశాల ఆధారంగా ఆయా దేశాల్లోని పేదరికం తీరుతెన్నులను అంచనా వేశారు. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల దుర్భర దారిద్య్రం ఆఫ్రికా ఖండంలోనే ఉందని ఇందులో తేలింది.   ప్రస్తుతమున్న పరిస్థితులే  అక్కడ కొనసాగితే 2030 కల్లా ప్రపంచంలోని పదింట తొమ్మిదో వంతు అతి పేదరికం ఆ ఖండంలోనే ఉంటుందని  హెచ్చరించింది. 
ఈ రిపోర్ట్‌లోని అంశాలు...క్లుప్తంగా ..

  • 2030 కల్లా భారత్‌ దుర్భర దారిద్య్రాన్ని పూర్తిగా రూపుమాపే అవకాశాలున్నాయి
  • 2020 సంవత్సరానికి భారత్‌లో  3 శాతం కంటే తక్కువే పేదలుంటారు
  • దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, ఫిలిప్పిన్స్, చైనా, పాకిస్తాన్‌లలో తలసరి ఆదాయ రేటు వృద్ధి చెందడం ఇందుకు ఉపయోగపడుతోంది. పేదరికం నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకు భారత్,చైనా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. 

ఆర్థికవేత్తల మాట అదే...
1991లో భారత్‌లో మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణలు పేదరికాన్ని తగ్గించడంతో పాటు దేశ పురోభివృద్ధికి దోహదపడిందని చెప్పడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ ప్రొఫెసర్‌ ఎన్‌ ఆర్‌ బానుమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం స్థిరమైన ఆర్థిక లక్ష్యాల సాధన అనేది ఓ సవాల్‌.  ఇది 2030 కల్లా కడు పేదరికాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు దోహదపడుతుంది, అయితే మిగిలిన 12 ఏళ్ల పాటు 7–8 శాతం వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుందని  చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top