మండుటెండలో పట్టెడన్నం కోసం... | Sakshi
Sakshi News home page

మండుటెండలో పట్టెడన్నం కోసం...

Published Mon, Apr 20 2020 3:20 PM

Hungry people stays longtime for food in queue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘హమ్‌ కమాకే కానే వాలే లోగ్‌ హై. మగర్‌ అబ్‌ ( మేం కష్టంతో సంపాదించి తినేవాళ్లం. కానీ ఇప్పుడు)...’ పెల్లుకుబి వస్తోన్న దుఃఖాన్ని పంటి బిగువున ఆపుకుంటూ బాధను వ్యక్తం చేసిన ఓ వలస కార్మికుడు. ఢిల్లీలోని భల్‌స్వా ప్రాంతంలో ‘శ్రీ శివ సేవక్‌ ఢిల్లీ’ శనివారం నాడు ఏర్పాటు చేసిన ఉచిత భోజన పంపిణీకి రెండు కిలీమీటర్ల దూరం వరకు క్యూ కట్టిన ప్రజల్లో ఆయనొకరు. సొంతూరుకు వెళ్లేందుకు దారిలేక, నగరంలో తిండి దొరికే మార్గం లేక అలమటిస్తున్న వలస కార్మికుల్లో ఆయనొకరు.

వందలాది మంది మహిళలు, పురుషులు చేతుల్లో సంచులు పట్టుకొని అన్నం కోసం ఎర్రటి ఎండలో నిలబడ్డారు. ఆ పూట గడవగా, మాపటికి సరిపడా అన్నం దొరికితే తీసుకుపోదామనే ఆశతోనే వారంతా సంచులు తెచ్చుకున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రతి ఏటా అమర్‌నాథ్‌ యాత్ర సందర్భంగా వేలాది మందికి ఉచితంగా అన్న దానం చేసే శివ సేవక్‌ సభ్యులే వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. క్యూలో నిలబడ్డ వారిలో ఎక్కువ మందికి రేషన్‌ కార్డులు లేవు. రేషన్‌ కార్డులు లేనివారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కూపన్లు జారీ చేస్తామని, ఆ కూపన్లు చూపిస్తే రేషన్‌ దుకాణాల్లో రేషన్‌ సరకులు ఇస్తారని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఆన్‌లైన్‌ కూపన్లు చూపించినా రేషన్‌ సరకులు ఇవ్వడం లేదని వలస కార్మికులు ఆరోపిస్తున్నారు. రేషన్‌ కార్డున్న వారికి సరఫరా చేయడమే కష్టం అవుతుంటే మీకెలా సరఫరా చేయగలమని డీలర్లు చెబుతున్నారని వారంటున్నారు. ‘నాకు ముగ్గురు పిల్లలు ఇంట్లో తిండి లేదు. అందుకనే వచ్చాను’ అని అన్నం కోసం క్యూలో నిలబడిన 28 ఏళ్ల వీణా సింగ్‌ వాపోయారు. ఎనిమిదేళ్ల క్రితం బీహార్‌ నుంచి భర్తతో కలిసి వచ్చిన ఆమె అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. తాను ఒకరింట్లో పని మనిషిగా పని చేయడం వల్ల నెలకు 1500 రూపాయలు వస్తున్నాయని, తన భర్త దినసరి వేతనం మీద కూలి పని చేస్తారని, నెలకు మూడు వేల రూపాయలు అద్దె కడుతుంటే తమ సంపాదన ఆడికాడికి అవుతుందని తెలిపారు. లాక్‌డౌన్‌తో పనిలేక భార్యాభర్తలిద్దరమూ రోడ్డున పడ్డామని ఆమె చెప్పారు. తాము రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదని ఆమె తెలిపారు.


ఢిల్లీలో రేషన్‌ కార్డులున్నవారికి ఉచితంగా రెట్టింపు రేషన్‌ ఇస్తున్నారు. చాలా మంది వలస కార్మికులకు ఆధార్‌ కార్డులున్నప్పటికీ రేషన్‌ కార్డులు లేవు. ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంది.

Advertisement
Advertisement