
రాహుల్‌పై గుజరాత్ మంత్రి ఫైర్
అహ్మదాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ తేదీలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు శ్రుతిమించుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై గుజరాత్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నట్టు రాహుల్ పరమశివుడి అవతారమే అయితే విషం తాగి పరీక్షించుకోవాలని అన్నారు.
సూరత్‌లోని బర్దోలిలో జరిగిన ఓ కార్యక్రమంలో గుజరాత్ గిరిజన సంక్షేమ మంత్రి గణపత్ వసావ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ 500 గ్రాముల విషం తీసుకున్న తర్వాత బతికిఉంటేనే ఆయనను శివుడి అవతారంగా పరిగణిస్తామని అన్నారు. పరమ శివుడు ప్రజలను కాపాడేందుకు గరళాన్ని సేవిస్తారని, రాహుల్‌ను సైతం 500 గ్రాముల విషం తీసుకునేలా ఆ పార్టీ కార్యకర్తలు చొరవ చూపి ఆయనను పరీక్షించాలని వ్యాఖ్యానించారు.
కాగా గుజరాత్ మంత్రి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు నైరాశ్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తింది. కాగా బాలాకోట్ వైమానిక దాడులపై ఆధారాలు కోరినందుకు సైతం కాంగ్రెస్‌పై వసావ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో జరిగే వైమానిక దాడుల సందర్భంగా కాంగ్రెస్ నేతను యుద్ధవిమానానికి వేలాడదీయాలని, ఆయన దాడులను కెమెరాలో చిత్రీకరిస్తారని ఎద్దేవా చేశారు.