
వివాదాస్పద బిల్లుకు గుజరాత్ ఓకే
మూడు సార్లు రాష్ట్రపతి ఆమోదం పొందలేకపోయిన వివాదాస్పద ఉగ్రవాద వ్యతిరేక బిల్లును గుజరాత్ శాసనసభ మరోసారి ఆమోదించింది.
గతంలో మూడుసార్లు రాష్ట్రపతి
ఆమోదం పొందని గుజ్‌కాక్ బిల్లు
బిల్లు పేరు మార్చి శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన ప్రభుత్వం
గాంధీనగర్: మూడు సార్లు రాష్ట్రపతి ఆమోదం పొందలేకపోయిన వివాదాస్పద ఉగ్రవాద వ్యతిరేక బిల్లును గుజరాత్ శాసనసభ మరోసారి ఆమోదించింది. గతంలో గుజరాత్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (గుజ్‌కాక్) బిల్లు అనే పేరుతో ఆమోదించిన బిల్లులో.. టెలిఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి, వాటిని సాక్ష్యాలుగా కోర్టులో సమర్పించడానికి పోలీసులకు అధికారం కల్పించటం వంటి వివాదాస్పద నిబంధనలన్నిటినీ యథాతథంగా ఉంచి.. బిల్లు పేరును గుజరాత్ కంట్రోల్ ఆఫ్ టైజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (జీసీటాక్) బిల్లు 2015గా మార్చిన బీజేపీ ప్రభుత్వం మంగళవారం దీనిని శాసనసభలో ప్రవేశపెట్టింది. దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ అందులోని వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రస్తుత చట్టాల్లోని నిబంధనలకు వ్యతిరేకమని, రాష్ట్రపతి గతంలో చేసిన సూచనలపై వాటిని తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే.. వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు ఐపీసీ సీఆర్‌పీసీ చట్టాల్లోని నిబంధనలు సరిపోవటం లేదని.. అందుకే కొత్త చట్టంలో కఠిన నిబంధనలు తెస్తున్నామని.. ఇవి దేశానికి, ప్రజలకు అనుకూలమైనవని ప్రభుత్వం సమర్థించుకుంది. దీనికి నిరసనగాకాంగ్రెస్ వాకౌట్ చేయగా అధికారపక్షం మెజారిటీ ఓటుతో బిల్లును ఆమోదించింది.
బిల్లులోని వివాదాస్పద సెక్షన్లు ఇవీ...
. సెక్షన్16: నిందితుడు సూపరింటెండెంట్ స్థాయి పోలీసు అధికారి ఎదుట ఇచ్చే నేరాంగీకార వాంగ్మూలాన్ని కోర్టు ఆధారంగా పరిగణించవచ్చు.
. సెక్షన్ 20(2)బి : కేసు దర్యాప్తును 90 రోజుల్లో పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయాలంటూ ప్రస్తుతమున్న గడువును 180 రోజులకు పొడిగించటం.
. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను.. ఇందుకోసం ఏర్పాటు చేసే ప్రత్యేక కోర్టులు మాత్రమే విచారించాలి. ఈ చట్టం కింద ఐదేళ్ల జైలు శిక్ష నుంచి గరిష్టస్థాయిలో మరణ దండన, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు.
గతంలో తిరస్కరణకు గురైందిలా...
. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2004లో గుజ్‌కాక్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. నాటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం తిప్పి పంపుతూ ఫోన్ సంభాషణల ట్యాప్ నిబంధనను తొలగించాలని సూచించారు.
. నాటి మోదీ ప్రభుత్వమే.. కలాం సూచనల మేరకు సదరు నిబంధనను తొలగించి మరోసారి ఇదే బిల్లును అసెంబ్లీలో ఆమోదించి నాటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు పంపించగా ఆమె కూడా తిరస్కరించారు.
. మళ్లీ 2009లో ఈ సవరణలేవీ లేకుండానే మూడోసారి బిల్లును శాసనసభలో ఆమోదించి రాష్ట్రపతికి పంపించారు. అప్పటి రాష్ట్రపతి ప్రతిభ బిల్లు పెండింగ్ పెట్టారు.
. తాజాగా తొలిసారి ఆమోదించిన బిల్లులోని వివాదాస్పద అంశాలను అలాగే ఉంచుతూ బిల్లు పేరును మాత్రం కొంత మార్చి మళ్లీ ఆమోదించింది. ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండటంతో రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.