గుజరాత్, హిమాచల్‌ ఫలితాలు.. మరికొద్ది గంటల్లో.. | gujarat and himachal pradesh assembly election result 2017 | Sakshi
Sakshi News home page

గుజరాత్, హిమాచల్‌ ఫలితాలు.. మరికొద్ది గంటల్లో..

Dec 17 2017 9:34 PM | Updated on Dec 17 2017 9:53 PM

gujarat and himachal pradesh assembly election result 2017 - Sakshi

సాక్షి, అహ్మదాబాద్‌/సిమ్లా: ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు మరికొద్దిగంటల వ్యవధిలో వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు సంబంధించి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌గాంధీకి ఈ ఫలితాలు అగ్నిపరీక్ష కాగా స్వరాష్ట్రం కావడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. వరుసగా ఆరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని అధికార బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా రెండు దశాబ్దాలుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ మళ్లీ కుర్చీ ఎక్కాలని తహతహలాడుతోంది. 2091లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయని అంతా భావిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం 33 జిల్లాలవ్యాప్తంగా 37 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. బీజేపీ తరఫున మోదీ, కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో పాకిస్థాన్‌ ప్రమేయం, రామమందిర నిర్మాణం, సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యలను ప్రస్తావించగా...గుజరాత్‌ అభివృద్ధి గురించి ఫ్రధాని మోదీగానీ మరేఇతర బీజేపీ నాయకులుగానీ మాట్లాడకపోవడాన్ని కాంగ్రెస్‌ తన ప్రచార ఆయుధంగా వాడుకుంది.

ఇక ఈ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ... పాటీదార్, ఓబీసీ, దళిత వర్గానికి చెందిన హార్దిక్‌ పటేల్, అల్పేశ్‌ఠాకూర్, జిగ్నేశ్‌ మేవానిలతో ఏకమైంది. పటేల్‌ వర్గానికి రిజర్వేషన్‌ కేటాయించాలని కోరుతూ హార్దిక్‌ పటేల్‌ ఉద్యమం నడుపుతుండడం తెలిసిందే. దళితులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా జిగ్నేశ్‌ తన గళం వినిపించారు. రాష్ట్ర జనాభాలో పాటీదార్‌ల సంఖ్య దాదాపు 12 శాతంగా ఉంది. బీజేపీని అధికారం నుంచి తప్పించాలనేదే తన లక్ష్యం కూడా కావడంతో హార్దిక్‌ ...కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచారు. ఇదిలాఉంచితే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం సామాజిక మాధ్యమాలను కూడా విస్తృతంగా వాడుకున్నాయి. అభివృద్ధి ఎటుపోయిందంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేయగా నేనే అభివృద్ధి.,..నేనే గుజరాత్‌ నినాదంతో బీజేపీ ముందుకు సాగింది. ఇక రెండు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో సగటున 68.41 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ నెల తొమ్మిదో తేదీన తొలివిడత ఎన్నికలు జరగ్గా మలివిడత పోరు 14వ తేదీన ముగిసింది. నర్మద జిల్లాలో అత్యధికంగా 79.15 శాతం ఓటింగ్‌ నమోదైంది. దేవభూమి ద్వారకలో అత్యంత స్పల్పంగా 60 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.  

అవినీతే బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రం
ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, ఆయన పూర్వ ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ ధుమల్‌ సహా మొత్తం 337 మంది అభ్యర్థుల భవితవ్యమేమిటనేది మరికొద్దిగంటల వ్యవధిలో తేలిపోనుంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మొత్తం 68 స్థానాలకు పోటీ చేశాయి. హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 75.28 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం తథ్యమని ఎన్నికల విశ్లేషకులు ఢంకా బజాయిస్తున్నారు. ఓట్ల లెక్కింపుకోసం మొత్తం 42 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక ఈ ఎన్నికల్లో విపక్ష బీజేపీ అవినీతినే తన ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకోగా... అధికార కాంగ్రెస్‌ పార్టీ జీఎస్టీ,  నోట్ల రద్దు అంశాలతో ప్రజల్లోకి వెళ్లింది. ఇంకా ఈ ఎన్నికల్లో బీఎస్పీ 42 స్థానాలనుంచి, సీపీఎం..14 చోట్ల నుంచి స్వాభిమాన్‌ పార్టీ, లోక్‌ఘట్‌బంధన్‌ పార్టీ తలో ఆరు స్థానాలనుంచి, సీపీఐ మూడుచోట్ల నుంచి పోటీ చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement