జమిలి ఎన్నికల దిశగా...

Govt Considers Referring Joint Elections Issue To Law Commission  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల దిశగా దేశమంతటా విస్తృత చర్చ జరిగేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే ప్రతిపాదనను లా కమిషన్‌కు నివేదించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. లా కమిషన్‌కు ఈ అంశాన్ని నివేదిస్తే వివిధ స్ధాయిల్లో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జమిలి ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీనియర్‌ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఏకకాల ఎన్నికల అంశాన్ని లా కమిషన్‌కు నివేదించడంపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని మరికొందరు అధికారులు పేర్కొన్నారు.

జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం వ్యక్తమైతే ఈ ప్రతిపాదన ఫలవంతమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన చట్టాల్లో ఏయే సవరణలు తీసుకురావాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని పేర్కొన్నాయి. మరోవైపు ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్‌ ప్రస్తుతం కసరత్తు సాగిస్తున్న క్రమంలో జమిలి ఎన్నికల ప్రతిపాదననూ కమిషన్‌కు నివేదిస్తారని భావిస్తున్నారు.

ప్రధాని మోదీ ప్రతిపాదించిన జమిలి ఎన్నికలపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పదేపదే ఎన్నికలు వస్తుండటంతో ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించలేకపోతున్నాయని జమిలి ఎన్నికలతో ఈ ఇబ్బందులు అధిగమించడంతో పాటు భారీ వ్యయప్రయాసలకు కళ్లెం వేయవచ్చని కేంద్రం వాదిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఆ పార్టీ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో చర్చించారు. ఈసీ సైతం జమిలి ఎన్నికలకు సానుకూలంగా ఉన్నా ఇది ఆచరణకు నోచుకోవాలంటే పలు రాజ్యాంగ సవరణలు అవసరమని ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని సూచిస్తోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top