
న్యూఢిల్లీ: వయోజనులు ఏడాదిలో ఎప్పుడైనా ఓటరుగా నమోదుచేసుకునే అవకాశాల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కేంద్రం కోరింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం..జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు మాత్రమే ఆ ఏడాది ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. జనవరి 1 గడువు దాటిన తరువాత వయోజనులైతే ఇక వారు తదుపరి ఏడాదే నమోదుచేసుకోవాలి. గతంలో ఓటరు నమోదుకు ఈసీ నాలుగు కటాఫ్ తేదీలుగా జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1ని ప్రతిపాదించగా, కేంద్రం జనవరి 1, జూలై 1లకు సమ్మతించింది. కానీ ఇప్పుడు 18 ఏళ్లు నిండిన వాళ్లు ఏడాదిలో ఎప్పుడైనా ఓటరుగా నమోదుచేసుకునేందుకున్న అవకాశాలను పరిశీలించాలని ఈసీకి సూచించింది.