విద్యార్థులకూ నేరుగా నగదు!

Each One Teach One part of govt aim to revamp higher education - Sakshi

ఈచ్‌ వన్, టీచ్‌ వన్‌ ఉద్యమం చేపట్టనున్న కేంద్రం

ఉన్నత స్థాయి విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బదులుగా విద్యార్థులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతే కాకుండా ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సాయం అందించే వారితో కలిసి ని«ధుల్ని సమీకరించడానికి ఒక వేదిక ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈచ్‌ వన్, టీచ్‌ వన్‌ (ప్రతీ ఒక్కరూ, ఒక్కరిని చదివించాలి) అనే నినాదంతో జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని లేవనెత్తడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.  

ఈచ్‌ వన్, టీచ్‌ వన్‌:  ధనిక వర్గాల్లోని ఒక్కో కుటుంబం ఒక నిరుపేద విద్యార్థికి చదవించడానికి ముందుకు రావాలని కేంద్రం పిలుపునివ్వనుంది. ఈ విధానంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, ఇచ్చిన డబ్బులు వృథా కాకుండా ఒక డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ను ఏర్పాటు చేయనుంది. విద్యాదాన్‌ పోర్టల్‌ తరహాలో రూపొందించే ఈ కొత్త పోర్టల్‌లో విద్యార్థులు, వారి చదువుకి సాయం అందించే దాతలు, విద్యాసంస్థల్ని అనుసంధానం చేస్తారు. మొత్తమ్మీద రూ.25 వేల కోట్ల నిధుల్ని సమీకరిస్తారు. వీటిని పూర్తి పారదర్శకంగా ఖర్చు చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు.

10 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుంది. ఈ సిఫారసుల్ని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణులతో కూడిన 10 గ్రూపులు మేధోమథనం నిర్వహించి (ఎడ్యుకేషన్‌ క్వాలిటీ అప్‌గ్రెడేషన్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ ప్రోగామ్‌ (ఎక్విప్‌)) రూపొందించారు. ఉన్నత విద్యా వ్యవస్థను ప్రక్షాళన కోసం వచ్చే అయిదేళ్లలో ఏయే నిర్ణయాలు తీసుకోవాలో ప్రతిపాదనలు చేశారు. ఈ గ్రూపులకు పలువురు ప్రముఖులు నేతృత్వం వహించారు. మాజీ రెవిన్యూ సెక్రటరీ హస్‌ముఖ్‌ అదిహ, నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్, ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌ కె. విజయరాఘవన్, రీడిఫ్‌ వ్యవస్థాపకుడు అజిత్‌ బాలకృష్ణన్, ఇన్ఫోసిస్‌ మాజీ సీఈవో క్రిస్‌ గోపాల్‌కృష్ణన్‌ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు.

సిఫారసులు
► ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి బదులుగా విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకే నేరుగా నగదు బదిలీ చేయాలి.
► ఇతర విద్యార్థులకు రుణాలు మంజూరు చేయాలి. విద్యార్థులను చదివించడానికి ముందుకు వచ్చేవారికి వారు అందించే ఆర్థిక సహకారంపై ఆదాయపు పున్ను మినహాయింపు కల్పించాలి.
► ఐఐటీ సహా దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో దాతృత్వ కార్యాలయాల ఏర్పాటు.
► 16 లక్షల మంది బీసీ విద్యార్థుల కోసం 8 వేల హాస్టళ్లు. దూర విద్య ద్వారా విద్యనభ్యసించే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజుల్లో 50 శాతం రాయితీ.
► ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 500 వృత్తివిద్యా డిగ్రీ కాలేజీల ఏర్పాటు.
► ప్రపంచస్థాయి ప్రమాణాల కోసం ఎంపిక చేసిన 40–50 విద్యాసంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి.
► విద్యార్థుల పరిశోధనలకు ఆర్థిక సహకారం కోసం జాతీయ అధ్యయన ఫౌండేషన్‌ ఏర్పాటు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top