25 మంది మహిళలు ‘తాళి’ తెంచేశారు | Dravidar Kazhagam holds 'thaali' removal function | Sakshi
Sakshi News home page

25 మంది మహిళలు ‘తాళి’ తెంచేశారు

Apr 14 2015 2:58 PM | Updated on Sep 3 2017 12:18 AM

25 మంది మహిళలు ‘తాళి’ తెంచేశారు

25 మంది మహిళలు ‘తాళి’ తెంచేశారు

ద్రావిడార్ కళగం మంగళవారం నాడిక్కడ చేపట్టిన ఓ కార్యక్రమంలో 25 మంది మహిళలు తమ మెడలోని మంగళ సూత్రాలను ఉదయం 6.45 గంటల ముహూర్తానికి తెంపేశారు. బానిసత్వం నుంచి విముక్తి అయినట్టు గర్వంగా ప్రకటించారు.

చెన్నై: ద్రావిడార్ కళగం మంగళవారం నాడిక్కడ చేపట్టిన ఓ కార్యక్రమంలో 25 మంది మహిళలు తమ మెడలోని మంగళ సూత్రాలను ఉదయం 6.45 గంటల ముహూర్తానికి తెంపేశారు. బానిసత్వం నుంచి విముక్తి అయినట్టు గర్వంగా ప్రకటించారు. వాటికున్న బంగారాన్ని హేతువాద ద్రావిడార్ కళగంకు విరాళంగా ఇచ్చారు. ఇంతలో ఈ కార్యక్రమాన్ని నిలిపినేస్తూ హైకోర్టు నుంచి ద్విసభ్య బెంచి ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. న్యాయ పోరాటంలో తాము విజయం సాధించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని ద్రావిడార్ కళగం అధ్యక్షుడు కే వీరమణి ప్రకటించారు. ‘ఆహా తాళి తెంచేయడంతో ఎంతో ఉపశమనంగా ఉంది. ఇంతకాలం దీన్ని ఓ అవమానకరమైన చిహ్నంగానే చూశాను. ఇక ముందు ఇది నా మెడలో లేకపోవడం వల్ల నాకు కలిగే బాధేమి లేదు’ అని ఈ కార్యక్రమంలో తాళి తెంచేసిన ఓ మహిళ వ్యాఖ్యానించారు.


మహిళల మెడల్లోని మంగళసూత్రాలకు ఎలాంటి మహత్తు లేదని, అవి బానిసత్వానికి చిహ్నాలని, వాటిని తెంపేసి బానిసత్వం నుంచి విముక్తులుకండంటూ తమిళనాడులోని ద్రావిడార్ కళగం చేపట్టిన తాజా ఉద్యమం హిందూ మతవాదుల ఆందోళనలతో వివాదాస్పదమైంది.వారు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే   మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జీ జస్టిస్ డీ హరి పరాంతమమ్ భావ ప్రకటన స్వేచ్ఛ కింద ద్రావిడార్ మంగళవారం తలపెట్టిన మంగళసూత్రం తెంపేసే కార్యక్రమానికి అనుమతించారు. దీనిపై హిందూ మతవాదుల ఒత్తిడి మేరకు రాష్ట్రప్రభుత్వం కోర్టు సింగిల్ జడ్జీ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని 19(2)(3)అధికరణ మేరకు ద్రావిడార్ కళగం చేపట్టిన కార్యక్రమాన్ని నిషేధిస్తున్నట్టు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. అలాగే ద్రావిడార్ కళగం ఈరోజు సాయంత్రం చేపట్టిన ‘ఆవు మాంసాహార విందు’ కార్యక్రమాన్ని కూడా కోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేసుకుంది. మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలకు వ్యతిరేకంగా ద్రావిడార్ కళగం ఈ విందు కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంది. ప్రముఖ తమిళ నాయకుడు, హేతువాది పెరియార్ రామస్వామి స్ఫూర్తితో ద్రావిడార్ కళగం ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement