breaking news
thaali removal
-
25 మంది మహిళలు తాళిబొట్లు తెంచేశారు!
చెన్నైలో ద్రవిడ కళగం ఆధ్వర్యంలో కార్యక్రమం సాక్షి, చెన్నై: ద్రవిడ కళగం(డీకే) పార్టీ మంగళవారం ఉదయం చెన్నైలో వివాదాస్పద ‘మంగళసూత్రం తీసివేత’ను నిర్వహించింది. ఇది ముగియగానే మద్రాస్ హైకోర్టు స్టే విధించడంతో ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నిర్వహించాల్సిన ‘గొడ్డు మాంస విందు’ ఆగిపోయింది. సోమవారం హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన అనుమతి ప్రకారం.. తాళి తీసివేత నిర్వహించామని డీకే అధ్యక్షుడు వీరమణి తెలిపారు. ఇందులో 25 మంది మహిళలు స్వచ్ఛందంగా మంగళసూత్రాలు తీసేశారని, ఆ బంగారాన్ని పార్టీకి ఇచ్చారని చెప్పారు. ‘మహిళను బానిసగా మార్చే తాళి అవసరమా?’ అంటూ చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళలు తాళిబొట్లను తెంచి భర్తలకు అందించారు. అవమానానికి చిహ్నమైన తాళిని తీసేశాక తనకు ఉపశమనం కలిగిందని ఓ మహిళ చెప్పింది. ఈ సందర్భంగా కొంతమంది డీకే, శివసేన కార్యకర్తల మధ్య స్పల్ప ఘర్షణ జరిగింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్రలో గోవధను నిషేధించినందుకు నిరసనగా గొడ్డు మాంస విందు ఇవ్వాలనుకున్నారు. ఇలా జరిగింది.. ఈ కార్యక్రమానికి తొలుత నగర పోలీస్ కమిషనర్ జార్జ్ అనుమతి నిరాకరించారు. పలు హిందూ సంఘాలు ఫిర్యాదు చేయడంతో డీకే చీఫ్ వీరమణిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. భావప్రకటన స్వేచ్ఛ కింద దీన్ని నిర్వహించుకోవచ్చంటూ జస్టిస్ డి. హరిపరంధామన్ సోమవారం అనుమతినిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు రాత్రే హైకోర్టులో అప్పీలు వేసింది. త్రిసభ్య ధర్మాసనం ఈ అప్పీలుపై మంగళవారం ఉదయం ఏడు గంటలకు విచారణ జరుపుతామంది. దీంతో షెడ్యూలు ప్రకారం ఉదయం పది గంటలకు జరగాల్సిన తాళి తొలగింపును డీకే ముందుకు జరిపి ఏడు గంటలకే మొదలుపెట్టింది. హైకోర్టు మొదలవగానే ప్రభుత్వం ఈ విషయాన్ని డివిజన్ బెంచ్ దృష్టికి తెచ్చింది. కార్యక్రమంతో శాంతిభద్రతల సమస్య తలె త్తే అవకావముందని పేర్కొంది. అయితే తాళి తొలగింపు కార్యక్రమం చాలా ఏళ్లుగా సాగుతోందని, శాంతిభద్రతలకు ఇబ్బంది లేదని డీకే న్యాయవాది వాదించారు. ప్రభుత్వ అప్పీలు సహేతుకంగా ఉందంటూ బెంచ్ సదరు కార్యక్రమంపై స్టే విధించింది. కాగా, తాళి తొలగింపుకు ప్రతిచర్యగా కోయంబత్తూరులోని ఓ ఆలయంలో భారత హనుమాన్ సేన అనే సంస్థ మహిళలకు పసుపుకొమ్ముకట్టిన మంగళసూత్రాలు పంచింది. -
25 మంది మహిళలు ‘తాళి’ తెంచేశారు
చెన్నై: ద్రావిడార్ కళగం మంగళవారం నాడిక్కడ చేపట్టిన ఓ కార్యక్రమంలో 25 మంది మహిళలు తమ మెడలోని మంగళ సూత్రాలను ఉదయం 6.45 గంటల ముహూర్తానికి తెంపేశారు. బానిసత్వం నుంచి విముక్తి అయినట్టు గర్వంగా ప్రకటించారు. వాటికున్న బంగారాన్ని హేతువాద ద్రావిడార్ కళగంకు విరాళంగా ఇచ్చారు. ఇంతలో ఈ కార్యక్రమాన్ని నిలిపినేస్తూ హైకోర్టు నుంచి ద్విసభ్య బెంచి ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. న్యాయ పోరాటంలో తాము విజయం సాధించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని ద్రావిడార్ కళగం అధ్యక్షుడు కే వీరమణి ప్రకటించారు. ‘ఆహా తాళి తెంచేయడంతో ఎంతో ఉపశమనంగా ఉంది. ఇంతకాలం దీన్ని ఓ అవమానకరమైన చిహ్నంగానే చూశాను. ఇక ముందు ఇది నా మెడలో లేకపోవడం వల్ల నాకు కలిగే బాధేమి లేదు’ అని ఈ కార్యక్రమంలో తాళి తెంచేసిన ఓ మహిళ వ్యాఖ్యానించారు. మహిళల మెడల్లోని మంగళసూత్రాలకు ఎలాంటి మహత్తు లేదని, అవి బానిసత్వానికి చిహ్నాలని, వాటిని తెంపేసి బానిసత్వం నుంచి విముక్తులుకండంటూ తమిళనాడులోని ద్రావిడార్ కళగం చేపట్టిన తాజా ఉద్యమం హిందూ మతవాదుల ఆందోళనలతో వివాదాస్పదమైంది.వారు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జీ జస్టిస్ డీ హరి పరాంతమమ్ భావ ప్రకటన స్వేచ్ఛ కింద ద్రావిడార్ మంగళవారం తలపెట్టిన మంగళసూత్రం తెంపేసే కార్యక్రమానికి అనుమతించారు. దీనిపై హిందూ మతవాదుల ఒత్తిడి మేరకు రాష్ట్రప్రభుత్వం కోర్టు సింగిల్ జడ్జీ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని 19(2)(3)అధికరణ మేరకు ద్రావిడార్ కళగం చేపట్టిన కార్యక్రమాన్ని నిషేధిస్తున్నట్టు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. అలాగే ద్రావిడార్ కళగం ఈరోజు సాయంత్రం చేపట్టిన ‘ఆవు మాంసాహార విందు’ కార్యక్రమాన్ని కూడా కోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేసుకుంది. మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలకు వ్యతిరేకంగా ద్రావిడార్ కళగం ఈ విందు కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంది. ప్రముఖ తమిళ నాయకుడు, హేతువాది పెరియార్ రామస్వామి స్ఫూర్తితో ద్రావిడార్ కళగం ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.