25 మంది మహిళలు తాళిబొట్లు తెంచేశారు! | 25 married women removes taali in chennai on tuesday | Sakshi
Sakshi News home page

25 మంది మహిళలు తాళిబొట్లు తెంచేశారు!

Apr 15 2015 1:46 AM | Updated on Sep 3 2017 12:18 AM

25 మంది మహిళలు తాళిబొట్లు తెంచేశారు!

25 మంది మహిళలు తాళిబొట్లు తెంచేశారు!

ద్రవిడ కళగం(డీకే) పార్టీ మంగళవారం ఉదయం చెన్నైలో వివాదాస్పద ‘మంగళసూత్రం తీసివేత’ను నిర్వహించింది.

  • చెన్నైలో ద్రవిడ కళగం ఆధ్వర్యంలో కార్యక్రమం
  • సాక్షి, చెన్నై: ద్రవిడ కళగం(డీకే) పార్టీ మంగళవారం ఉదయం చెన్నైలో వివాదాస్పద ‘మంగళసూత్రం తీసివేత’ను నిర్వహించింది. ఇది ముగియగానే మద్రాస్ హైకోర్టు స్టే విధించడంతో ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నిర్వహించాల్సిన ‘గొడ్డు మాంస విందు’ ఆగిపోయింది. సోమవారం హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన అనుమతి ప్రకారం.. తాళి తీసివేత నిర్వహించామని డీకే అధ్యక్షుడు వీరమణి తెలిపారు. ఇందులో 25 మంది మహిళలు స్వచ్ఛందంగా మంగళసూత్రాలు తీసేశారని, ఆ బంగారాన్ని పార్టీకి ఇచ్చారని చెప్పారు.
     
     ‘మహిళను బానిసగా మార్చే తాళి అవసరమా?’ అంటూ చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళలు తాళిబొట్లను తెంచి భర్తలకు అందించారు. అవమానానికి చిహ్నమైన తాళిని తీసేశాక తనకు ఉపశమనం కలిగిందని ఓ మహిళ చెప్పింది. ఈ సందర్భంగా కొంతమంది డీకే, శివసేన కార్యకర్తల మధ్య స్పల్ప ఘర్షణ జరిగింది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ  కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్రలో గోవధను నిషేధించినందుకు నిరసనగా  గొడ్డు మాంస విందు ఇవ్వాలనుకున్నారు.
     
     ఇలా జరిగింది..  ఈ కార్యక్రమానికి తొలుత నగర పోలీస్ కమిషనర్ జార్జ్ అనుమతి నిరాకరించారు. పలు హిందూ సంఘాలు ఫిర్యాదు చేయడంతో డీకే చీఫ్ వీరమణిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. భావప్రకటన స్వేచ్ఛ కింద దీన్ని నిర్వహించుకోవచ్చంటూ జస్టిస్ డి. హరిపరంధామన్ సోమవారం అనుమతినిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు రాత్రే హైకోర్టులో అప్పీలు వేసింది. త్రిసభ్య ధర్మాసనం ఈ అప్పీలుపై మంగళవారం ఉదయం ఏడు గంటలకు విచారణ జరుపుతామంది. దీంతో షెడ్యూలు ప్రకారం ఉదయం పది గంటలకు జరగాల్సిన తాళి తొలగింపును డీకే ముందుకు జరిపి ఏడు గంటలకే  మొదలుపెట్టింది. హైకోర్టు మొదలవగానే ప్రభుత్వం ఈ విషయాన్ని డివిజన్ బెంచ్ దృష్టికి తెచ్చింది. కార్యక్రమంతో శాంతిభద్రతల సమస్య తలె త్తే అవకావముందని పేర్కొంది.
     
     అయితే తాళి తొలగింపు కార్యక్రమం చాలా ఏళ్లుగా సాగుతోందని,  శాంతిభద్రతలకు ఇబ్బంది లేదని డీకే న్యాయవాది వాదించారు. ప్రభుత్వ అప్పీలు సహేతుకంగా ఉందంటూ బెంచ్ సదరు కార్యక్రమంపై స్టే విధించింది. కాగా, తాళి తొలగింపుకు ప్రతిచర్యగా కోయంబత్తూరులోని ఓ ఆలయంలో భారత హనుమాన్ సేన అనే సంస్థ మహిళలకు పసుపుకొమ్ముకట్టిన మంగళసూత్రాలు పంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement