‘మాస్క్‌’లు కాలుష్యాన్ని ఆపుతాయా!?

Do Face Masks Reduse Pollution Effect in the Air - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢీల్లీతోపాటు ప్రపంచంలోని పలు నగరాలు నేడు అధిక వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త డీజిల్‌ కార్ల కొనుగోలుపై నిషేధం విధించడంతోపాటు ప్రస్తుత కార్లను రోడ్లపైకి ‘సరి బేసి’ విధానంతో అనుమతిస్తున్నారు. అంటే నెంబర్‌ ప్లేట్‌పై సరి సంఖ్య కలిగిన కార్లను ఒక రోజు అనుమతిస్తే బేస్‌ సంఖ్య కలిగిన కార్లను ఆ మరుసటి రోజు అనుమతిస్తున్నారు. లండన్‌లో ‘కంజెషన్‌ చార్జింగ్‌ (రద్దీ నివారణకు చార్జీలు)’ అమలు చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు తిరిగే అన్ని వాహనాలపై నిర్దేశిత చార్జీలు వసూలు చేస్తారు. శని, ఆదివారాల్లో, ఇతర సెలవు దినాల్లో వసూలు చేయరు. పారిస్‌లో ‘బైక్‌ షేరింగ్‌’ విధానాన్ని అమలు చేస్తుండగా, చైనాలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ దళం రోడ్లపై, ఖాళీ ప్రాంతాల్లో ఎక్కడా చెత్తా చెదారాన్ని ప్రజలు కాల్చకుండా చూడడంతోపాటు కాలం తీరిన వాహనాలను పట్టుకొని డంపింగ్‌ యార్డ్‌కు తరలిస్తారు.


ప్రధానంగా వాయు కాలుష్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ధూళి లేదా నుసి రేణువులు కాగా, మరొకటి గ్యాసెస్‌. ఓజోన్, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డైఆక్సైడ్‌ ప్రమాదకర గ్యాస్‌లు. నుసి రేణువులతోపాటు గ్యాస్‌లను పీల్చడం వల్ల ప్రజల ఉపిరితిత్తులు, గుండె మాత్రమే కాకుండా మెదడు కూడా దెబ్బతింటుంది. వీటినుంచి రక్షించుకోవడానికి పాదాచారులు, సైక్లిస్టులు, ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు మాస్క్‌లు ధరిస్తున్నారు. అవి ఎంత వరకు సురక్షితం ? అవి ఎన్ని రకాలు ?

ఇవి పలు రకాలు
తక్కువ ధర కారణం కావొచ్చేమోగానీ ఎక్కువ మంది ‘పేపర్‌ డస్ట్‌ మాస్క్‌’లను ఉపయోగిస్తున్నారు. ఈ మాస్క్‌లు కేవలం పది శాతం కాలుష్యాన్ని మాత్రమే నివారిస్తాయి. కనుక వీటి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. హెపా ఫిల్టర్‌ మాస్క్‌లు, అందులో ముఖ్యంగా ‘ఎన్‌95 రెస్పిరేటర్లు’ బాగా పనిచేస్తాయని, ఇవి 0.3 మైక్రాన్ల నుసి రేణువులను కూడా అడ్డుకోగలవని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇవి వాయు కాలుష్యాన్ని మాత్రమే అడ్డుకుంటాయి.

గ్యాసుల కాలుష్యాన్ని అడ్డుకోవాలంటే ‘ఫేస్‌మాస్క్‌’లను ధరించాలి. వీటి మీద ఇప్పటి వరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఒక్క చైనాలోనే మూడు పరిశోధనలు జరిగాయి. 2009, 2012, 2017 సంవత్సరాల్లో అధ్యయనం చేసి చైనా ‘ఎన్‌95 మాస్క్‌ల’ను అభివద్ధి చేసింది. ఈ మాస్క్‌లతోని కొంత ప్రయోజనం ఉన్నా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏ మాత్రం గాలి జొరబడకుండా ఫేస్‌ మాస్క్‌లను సీల్‌ చేసినట్లుగా ధరించాలి. దాని వల్ల చాలా మందికి చికాకుగా ఉంటుంది. గెడ్డం పెంచిన వాళ్లే కాకుండా గెడ్డం గీసుకోని వాళ్లు వీటిని ధరించడం కుదరదు. పైగా ఖరీదు కూడా కాస్త ఎక్కువే (600 నుంచి 2,500 రూపాయల వరకు). ఈ ప్రత్యామ్నాయాలను పాటించే బదులు ‘నేను సైతం పర్యావరణ పరిరక్షణకు ప్రమిదనవుతాను’ అంటూ ప్రజలు ముందుకు వస్తే అందుకు ప్రభుత్వాలు కూడా మోకరిల్లక తప్పదు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top