పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు

Districts will be by the Parliament constituencies - Sakshi

     అప్పుడే అధికార వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి

     ‘ఇండియా నెక్ట్స్‌’ సదస్సులో రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేయాలని, అప్పుడే అధికార వికేంద్రీకరణ జరిగి అభివృద్ధికి అవకాశం ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ‘ఇండియా నెక్ట్స్‌’సదస్సు శనివారం ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుభాష్‌ కశ్యప్‌ మాట్లాడుతూ.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో ఐక్యతను చాటే కొన్ని రాజ్యాంగ సంస్థలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలకలుగా మారాయని సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రాలకు అధికారాలు కల్పించే విషయాన్ని కేంద్రంలోని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, గతంలో సీఎంలుగా పని చేసేటప్పుడు చేసిన డిమాండ్లను నేడు ప్రధానులుగా తిరస్కరిస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నరేంద్ర మోదీ అధికారాల వికేంద్రకరణపై చేసిన డిమాండ్లను ఇప్పుడు ప్రధానిగా ఆయనే తిరస్కరిస్తున్నారని తప్పుపట్టారు. కేంద్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీలు రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి విధానాలను దెబ్బతీస్తూ, కొత్త విధానాలను తమకు నచ్చినట్టుగా పొందుపరుస్తున్నాయని మండిపడ్డారు. 

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా... 
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వాలు అధికారాలన్నింటినీ తమ చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నాయని జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ సొంత మనుషులను రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ కూడా కొన్ని అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని మార్చి రాష్ట్రాలకు, జిల్లాలకు, స్థానిక సంస్థలకు నేరుగా అధికారాల వికేంద్రీకరణ చేయాలని ఆయన సూచించారు. జీఎస్టీతో దేశంలో ఒకే పన్ను అమల్లోకి రావడం వల్ల రాష్ట్రాలకు కొంత మేలు జరుగుతోందని, గతంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు 32 శాతం వచ్చే నిధులు ఇప్పుడు 42 శాతానికి పెరిగాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత సూర్యారావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే ఇలాంటి సంస్కరణలు ఇంకా రావాల్సి ఉందన్నారు. సదస్సులో ‘ఇండియా నెక్ట్స్‌’సంస్థ అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎం.అమరేంద్ర పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top