మానవ హక్కుల్ని కాలరాసిన భారత్‌

Deporting Seven Rohingya Men, India Commits Human Rights Violation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏడుగురు రోహింగ్యా ముస్లింలను భారత ప్రభుత్వం గురువారం నాడు మయన్మార్‌కు పంపించిన విషయం తెల్సిందే. వారు 2012లో భారత్‌లో అక్రమంగా ప్రవేశించి అరెస్టయ్యారు. అప్పటి నుంచి వారు అస్సాం జైల్లోనే ఉన్నారు. వారిని వెనక్కి పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొంత మంది మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో వారిని గురువారం మయన్మార్‌కు సాగనంపారు.

మయన్మార్‌లో 2012 నుంచే కల్లోల పరిస్థితులు నెలకొని ఉండగా, 2016లో మైనారిటీలయిన రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకంగా అక్కడ మారణ హోమం ప్రారంభమైంది. ఆ జాతిని సమూలంగా నిర్మూలించేందుకు మయన్మార్‌ సైన్యం నడుంగట్టింది. పర్యవసానంగా వేలాది కుటుంబాలను హత్య చేశారు. వందలాది గ్రామాలను తగులబెట్టారు. మహిళలు, పిల్లలపై సామూహికంగా హత్యలు జరిపారు. ఇక ఆ దేశంలో తలదాచుకునేందుకు కూడా చోటు లేక దాదాపు 9 లక్షల మంది రోహింగ్యాలు ఇరుగు, పొరుగు దేశాల వైపు పరుగులు తీశారు. ఈ దారణ మారణ కాండను ఐక్యరాజ్య సమితితోపాటు పలు ప్రపంచ దేశాలు ఖండించాయి.

శాంతి భద్రతల పరిస్థితిని చక్కదిద్దాలని, రోహింగ్యాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని మయన్మార్‌ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. అప్పటి వరకు తాత్కాలికంగానైనా సరే రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలని ఇరుగు పొరుగు దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారీ సంఖ్యలో పరుగెత్తుకొచ్చిన రోహింగ్యాలను అటు బంగ్లా, ఇటు భారత దేశం సరిహద్దుల్లోనే నిలిపి వేశాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఏడుగురు రోహింగ్యాలను భారత ప్రభుత్వం వెనక్కి పంపించింది. మాతృ దేశంలో మారణ హోమం కొనసాగుతున్నప్పుడు వారిని అక్కడికి పంపించడం కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టం ‘రిఫౌల్‌మెంట్‌’ను ఉల్లంఘించడమే. ఓ దేశంలో జాతుల మధ్య హింసాకాండ కొనసాగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాందిశీకులను లేదా శరణార్థులను ఆ దేశానికి పంపించకూడదన్నదే ‘రిఫౌల్‌మెంట్‌’ ఒప్పందం. ఈ అంతర్జాతీయ ఒప్పందంపై భారత్‌ కూడా సంతకం చేసింది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి హెచ్చరికలను పట్టించుకోకుండా రోహింగ్యా ముస్లింలను పంపించాలని భారత ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంది. అస్సాంలో అసలైన భారతీయ పౌరులను గుర్తించడంలో భాగంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను వేరు చేసేందుకు  కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించేందుకు బిల్లును తీసుకొచ్చిన (ప్రస్తుతం ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది) భారత ప్రభుత్వం రోహింగ్యాలను వెనక్కి పంపించడానికి కారణం వారు ముస్లింలు కావడమేనా...!

చదవండి: రెచ్చగొడితేనే ‘మారణ హోమాలు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top