
సరిహద్దు వరకు వచ్చి ఆగిపోయిన రాహుల్
ఠాకూర్లు.. దళితుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగిన ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ ప్రాంతానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు.
ఠాకూర్లు.. దళితుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగిన ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ ప్రాంతానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు. నగరంలోకి గానీ, జిల్లాలోకి గానీ పోలీసులు ఆయనను అనుమతించకపోవడంతో.. సరిహద్దుల వద్దే ఆయన సమావేశం నిర్వహించారు. ఇంతకుముందు బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చినప్పుడు అక్కడ అల్లర్లు మళ్లీ చెలరేగడంతో రాజకీయ నాయకులెవరినీ అక్కడకు అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినా అక్కడకు వెళ్లాలని రాహుల్ పట్టుబట్టగా, ఆయనను సరిహద్దుల వద్దే ఆపేశారు. దాంతో నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్డర్ చెక్‌పోస్టు వద్దే ఆయన బాధిత కుటుంబాలను కలుస్తానన్నారు. సహారన్‌పూర్ లోపలకు ప్రవేశించడానికి మూడు మార్గాలున్నాయి. ముజఫర్‌నగర్, బదోద్-షామ్లి, పానిపట్ యమునా నగర్.. ఈ మూడు మార్గాలను పోలీసులు ముందుగానే దిగ్బంధించారు.
ఇప్పటికీ అక్కడ పరిస్థితి సున్నితంగా ఉండటం వల్లే రాహుల్ గాంధీని సహారన్‌పూర్‌కు అనుమతించడం లేదని యూపీ మంత్రి సిద్దార్థనాథ్ సింగ్ చెప్పారు. సహారన్‌పూర్ పర్యటనకు వచ్చినప్పుడు మాయావతి రెచ్చగొట్టేలా ప్రసంగించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు రాహుల్ వస్తున్నది కూడా కేవలం ఫొటోలతో హడావుడి చేయడానికేనని, ఈ విషయాన్ని ఇలా రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు. ఘర్షణల కేసును సిట్ విచారిస్తుండగా, దీనిపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా వినేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత దాన్ని విచారించవచ్చని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం చెప్పింది.